KKR Playing 11 vs SRH For IPL 2024 Qualifier 1: ఐపీఎల్ 2024లో నేడు కీలక క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు క్వాలిఫయర్-1లో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు మాత్రం క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయం సాధించి ఎలాంటి రిస్క్ లేకుండా ఫైనల్ చేరాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
లీగ్ దశలో అసాధారణ ప్రదర్శనతో టేబుల్ టాపర్‌గా నిలిచిన కోల్‌కతా.. ప్లేఆఫ్స్‌లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. అయితే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ తరఫున ఆడేందుకు సాల్ట్ స్వదేశం వెళ్ళిపోయాడు. దాంతో అతని స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు మినహా తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
ఫిల్ సాల్ట్ దూరమైనా కోల్‌కతా బ్యాటింగ్ భీకరంగానే ఉంది. సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్ లాంటి స్టార్ ఫామ్‌లోనే ఉన్నారు. మరోవైపు రింకూ సింగ్ బ్యాట్ జిలిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్, ఆండ్రీ రస్సెల్‌తో పేస్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు ఉండనే ఉన్నారు. వీరందరూ సమష్టిగా రాణిస్తే సునాయస విజయం ఖాయం. ఇక వైభవ్ అరోరా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.
కోల్‌కతా తుది జట్టు (అంచనా):
సునీల్ నరైన్, రెహ్మానుల్లా గుర్జాజ్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.