Family Suicide Case: కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో శనివారం ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంనకు చెందిన సుబ్బారావు చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తుండగా… శనివారం ఉదయం ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పద్మావతి, వినయ ఇంట్లో ప్రాణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసులకు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. మూడెకరాల పొలం అమ్ముదామని అనుకోగా రికార్డులు తారుమారు కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో రాసి ఉంది. పొలం వేరే వాళ్ల పేరుతో రికార్డుల్లో ఉందని.. రెవెన్యూ అధికారులు మోసం చేశారని, ఏమి చేయలేని స్థితిలో చనిపోతున్నట్లు వారు అందులో పేర్కొన్నారు.
Read Also: Mobile Explosion: విషాదం.. మొబైల్ పేలి నలుగురు చిన్నారులు మృతి
ఈ కేసు గురించి డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశంలో పలు కీలక వివరాలను వెల్లడించారు. అవి ఆత్మ హత్యలు కాదు, హత్యలు అని.. భర్త సుబ్బారావు భార్య పద్మావతి, కుమార్తె వినయలకు ఇంట్లో మత్తు మందిచ్చి హత్యకు పాల్పడ్డాడని.. అనంతరం తాను వెంకట్రాద్రి ఎక్స్‌ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ దుర్ఘటనకు మృతుని అప్పులు, క్రికెట్ బెట్టింగ్ వ్యసనాలు కూడా ఓ కారణమని పేర్కొ్న్నారు. ప్రభుత్వ భూమి ఆన్‌లైన్ చేసుకొని చేతులు మారడంపై రెవెన్యూ ఉన్నతాధికారుల విచారణ సాగుతోందన్నారు. ఈ మీడియా సమావేశంలో సీఐ పురుషోత్తమరాజు, ఎస్సై మధుసూధన్ రావులు పాల్గొన్నారు.