ఐపీఎల్‌లో సత్తాచాటి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న ఆటగాడు అవేశ్ ఖాన్. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా పేసర్ అవేశ్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేయడంతో దాన్ని వాళ్ల నాన్నకు అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో అంతగా రాణించకపోయినా.. అతడు ఈ మ్యాచ్‌లో 4/18 మేటి ప్రదర్శన చేశాడు. దీంతో టీమ్‌ఇండియా 82 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన అవేశ్ తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉందన్నాడు.
తన అద్భుత ప్రదర్శన క్రెడిట్ అంతా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కే దక్కుతుందుని అవేశ్ ఖాన్ ప్రకటించడం గమనార్హం. తాను మొదటి మూడు టీ20 మ్యాచుల్లో ఒక్క వికెట్ తీయకపోయినా రాహుల్ సార్ తనకు మద్దతుగా నిలిచినట్టు అవేశ్ ఖాన్ చెప్పాడు. “దక్షిణాఫ్రికాతో మొదటి మూడు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో నాపై ఒత్తిడి ఉంది. కానీ, రాహుల్ సర్, జట్టు యాజమాన్యం నాకు మరో అవకాశం ఇచ్చింది. దాంతో నాలుగు వికెట్లు తీయగలిగాను. మా నాన్న పుట్టిన రోజు కావడంతో ఆయనకు దీన్ని బహుమతిగా ఇస్తున్నాను’’అని అవేశ్ ఖాన్ పేర్కొన్నాడు.
నాలుగు వికెట్లు తీయడం వెనుక తన వ్యూహాన్ని అవేశ్ ఖాన్ చెప్పాడు. ” ఇక్కడ నేనేం ప్రణాళికలు రచించలేదు. సహజసిద్ధంగా బౌలింగ్ చేసి వికెట్లకేసి విసరాలనుకున్నా. ఈ పిచ్ వైవిధ్యంగా ఉంది. బంతి కొన్నిసార్లు బౌన్స్ అయ్యింది.. కొన్నిసార్లు కింద నుంచి వెళ్లింది. దీంతో కాస్తంత బౌన్స్ ప్రదర్శించి సరైన లెంగ్త్‌లో వేయాలనుకున్నా. అలాగే రిషభ్ పంత్ కూడా పరిస్థితులకు తగ్గట్టు ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాడు. దాంతో జాన్సెన్, మహారాజ్‌ల వికెట్లు సాధించా. మరోవైపు జట్టుగా మేం బాగా ఆడుతున్నాం. ఫీల్డింగ్, బౌలింగ్ బాగా చేస్తున్నాం. దీంతో ఆఖరి మ్యాచ్‌ను కూడా ఆస్వాదించాలనుకుంటున్నాం.” అని అవేశ్ చెప్పుకొచ్చాడు.