Andhra Pradesh: రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. ఎక్కడ చూసిన వాగులు వంకలు పొంగి పొరుళుతున్నాయి. ఆగని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలని వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ధాటికి చెట్లు చేమలు నేలకూలాయి. ఇళ్లలోకి సైతం వరద నీరు చేరింది.
గతంలో కొన్ని అపార్ట్మెంట్ లలోకి వరద నీరు ప్రవేశించిన ఘటనలు కూడా చూసాం. రహదారులు దెబ్బతిన్నాయి. ఈ వర్షాలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆంధ్రాలోనూ ఇదే పరిస్థితి. తాజాగా ఓ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు మూడు రోజులు పట్టింది.
వివరాలలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరిలో ఏజెన్సీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ముంచింగిపుట్టు మండలం లక్ష్మిపురం పంచాయితీ తుమ్మిడి పుట్టుకి చెందిన బురిడీ బాను అనే గిరిజన బాలిక అనారోగ్యం తో మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమె మృత దేహానికి దహన సంస్కారాలు నిర్వహించాల్సి ఉంది.
కానీ ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దహన సంస్కారాలు మూడు రోజులుగా నిలిచిపోయాయి. ఎంతకి వాగు ఉదృత తగ్గకపోయేసరికి ప్రమాదం అని తెలిసున్న బంధువులు అతి కష్టం పైన వాగుని ధాటి దహన సంస్కారాలు పూర్తి చేశారు. బాలిక చనిపోయిందని బాధలో ఉన్న కుటుంబ సభ్యులకి మరింత భాధను కలిగించేలా బాలిక దహన సంస్కారాలు మూడు రోజులు నిలిచిపోవడం చాలా బాధాకరం.