ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,మంత్రి నారా లోకేష్ తో పాటు సినీ పరిశ్రమమీద పోసాని చేసిన వ్యాఖ్యలపై ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో నమోదైన కేసులో హైదరాబాద్ వెళ్లి పోసానిని అరెస్ట్ చేసారు పోలిసులు. ఓ వైపు ఈ కేసు వ్యవహారం నడుస్తుండగానే రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో కొద్దికాలంగా పోసాని జైల్లోనే ఉన్నారు. తాజాగా పోసానిపై నమోదైన సీఐడీ కేసులో బెయిల్ లభించింది. దీంతో పోసాని విడుదలకు మార్గం సుగమం అయినట్టు అయ్యింది. కానీ గుంటూరు జైలు నుంచి సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదల అవుతారా లేదా అని టెన్షన్ నెలకొంది.
సీఎం చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై దుర్భాషలాడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న పోసాని. సీఐడీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయటంతో కర్నూలు జైలు నుంచి పీటీ వారంట్ పై గుంటూరుకు తరలించారు. గుంటూరు కోర్టు రిమాండ్ విధించటంతో అప్పటి నుంచి జిల్లా జైల్లోఉన్నారు పోసాని. అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వవలసిందిగా పిటిషన్ దాఖలు చేసిన పోసానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలో గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జి.స్పందన షరతులు వివరాలు వెల్లడిస్తూ ‘ రెండు లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలి. జైలు నుంచి విడుదలైన అనంతరం దేశం విడిచి వెళ్లరాదు. కేసు గురించి ఎక్కడా ప్రకటనలు చేయరాదు. నాలుగు వారాలపాటు ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు మంగళగిరిలోని సీఐడీ పోలీస్టేషన్ లో హాజరుకావాలి. సాక్షులపై ఎలాంటి ప్రభావం చూపరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది.