తెలంగాణలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కాగా.. పోలింగ్ రాష్ట్రమంతటా ప్రశాంతంగా జరగ్గా, కొన్నిచోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా.. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా పరకాల మండలం నాగారంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ సెంటర్ దగ్గర బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టారు.
Read Also: MS Dhoni: రాబోయే సంవత్సరాల్లో చెన్నైలో ‘ధోని’ దేవాలయాలు కడతారు..
బీఆర్ఎస్ నాయకులు రత్నాకర్ రెడ్డి, నాగయ్య, గుండె వేణులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల దాడిని నిరసిస్తూ పరకాల పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో.. పరకాల-హుజురాబాద్ ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
Read Also: Mamata Banerjee: రాష్ట్ర మహిళల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దు.. ప్రధానిపై దీదీ ఫైర్