భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు దక్షిణాది నాలుగు భాషలవారు ఒకప్పుడు సంయుక్త మదరాసు రాష్ట్రంలో కలసిమెలసి ఉన్నారు. ఎప్పుడయితే భాషల వారిగా రాష్ట్రాలు ఏర్పడ్డాయో అప్పటి నుంచీ భేదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సౌత్ సినిమాకు కేంద్రంగా నిలచిన మదరాసులో తెలుగు వర్సెస్ తమిళ్ అనే గొడవ మొదలయింది. మదరాసు రాష్ట్రం నుండి విడివడిన తరువాత కూడా తెలుగు సినిమాకు కూడా మదరాసే కేంద్రంగా ఉండేది. అప్పటి నుంచే తెలుగు, తమిళ అన్న భేదాలు చిత్రసీమలోనూ పొడసూపాయి. ఆ యా భాషలవారు తమ సొంత రాష్ట్రాలకు తరలివెళ్ళిన తరువాత మదరాసు బోసిపోయింది. దాంతో సినిమా జనం లబోదిబోమన్నారు. దక్షిణాది అందరమూ ఒకటే అనే భావనను మెల్లగా ప్రోది చేశారు. దాంతో సౌత్ సినిమా సైతం ఉత్తరాది చిత్రాలకు దీటుగా రాజ్యమేలసాగింది. అది కాస్తా మరచిపోయి ఇప్పుడు మళ్ళీ ‘తెలుగు వర్సెస్ తమిళ్’ అనే పోటీ మొదలయింది. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్-1’, తెలుగు హీరో ప్రభాస్ నటించగా ఉత్తరాదివారు రూపొందిస్తోన్న ‘ఆదిపురుష్’ చిత్రాల హంగామా కారణంగానే మళ్ళీ ఈ విభేదాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. మణిరత్నం సినిమా మొదటి మూడు రోజుల్లో ఏ క్లాస్ సెంటర్స్ లోని జనాలను మాత్రమే ఆకట్టుకోగలిగింది. తరువాత మెల్లగా జారిపోయింది. ఈ నేపథ్యంలో తెలుగువారు ఆ సినిమాను రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ తో పోల్చి, ట్రోల్ చేశారు. ఇప్పుడు ‘ఆదిపురుష్’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు ఉత్తరాదివారిని, ఇటు తెలుగువారిని ట్రోల్ చేయవచ్చునని తమిళ తంబీలు భావించారు. ఈ ట్రైలర్ లో రాముడు మీసాలతో కనిపించడం, పైగా లైవ్ మోషన్ లో రూపొందించిన విజువల్స్ అంతగా అలరించక పోవడం చూపుతూ తమిళసోదరులు ట్రోల్ స్పీడు పెంచారు. ఇలా విభేదాలు మొదలయితే ప్రస్తుతం సౌత్ సినిమాకు ఉన్న క్రేజ్ ఉత్తరాదిన తగ్గే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ చిత్రమే! ఎందుకంటే వారి భారీతనం ముందు మన దక్షిణాది చిత్రాలు వెలవెల పోయేవి. పైగా హిందీ సినిమా అంతర్జాతీయ మార్కెట్ లో ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు దానిని అధిగమిస్తూ సౌత్ సినిమా సాగుతోంది. నేడు సౌత్ సినిమా అంటే తెలుగు చిత్రమే! ఆ తీరున మార్కెట్ ను విస్తరించుకుంది తెలుగు సినిమా. ఒకప్పుడు ఉత్తరాది వారికి దక్షిణాది నాలుగు భాషల చిత్రాలనూ ఒకే గాటన కట్టి ‘మదరాసీ చిత్రం’ అనేవారు. 1983లో నటరత్న యన్టీఆర్ తన ‘తెలుగుదేశం’ పార్టీ సాధించిన అపూర్వ విజయంతో ఉత్తరాది వారు సైతం తెలుగునేలవైపు చూసేలా చేశారు. పైగా తెలుగువారిపై ఉన్న మదరాసీ ముద్ర చెరిగిపోయింది. అదే తీరున ఒకప్పుడు సౌత్ సినిమా అంటే తమిళ చిత్రాలవైపే చూసేవారు. ఎందువల్లనంటే తమిళ సినిమాలకు డబ్బింగ్ రూపంలో తెలుగునేలపైనా, ఉత్తరాన మంచి క్రేజ్ ఉండేది. ఆ తరువాత సింగపూర్, మలేసియా, జపాన్, శ్రీలంక వంటి దేశాల్లోనూ మార్కెట్ సాధించాయి. అయితే ‘బాహుబలి’ సిరీస్ తో తెలుగు సినిమా భారతీయ భాషలన్నిటికన్నా మిన్నగా సాగింది. అదీగాక విదేశాల్లోనూ హిందీ సినిమాలను మించి ఆదరణ చూరగొంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. లండన్ లో అతి ప్రతిష్ఠాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితమైన తొలి భారతీయ చిత్రంగానూ ‘బాహుబలి’ నిలచింది. అందువల్ల ఇండియన్ సినిమాను సౌత్ మూవీ అందునా తెలుగు సినిమా డామినేట్ చేస్తోందన్నది అక్షరసత్యం!
నిజానికి తమిళులు ఏది చేసినా ‘మేమే ముందు చేశాం’ అని చాటింపు వేసుకొనే అలవాటు ఉన్నవారు. దక్షిణాది తొలి టాకీ చిత్రం ‘కాళిదాసు’ అందులో ప్రధాన పాత్రధారులు తెలుగు మాట్లాడతారు. తక్కువ స్థాయిలోనే తమిళం వినిపిస్తుంది. ఆ మిశ్రమభాషా చిత్రాన్ని తొలి తమిళ చిత్రంగా తమ ఖాతాలో వేసుకున్న ఘనులు వారు. యన్టీఆర్ ఘనవిజయాన్ని కూడా వారు తమదిగానే భావించారు. ఎందుకంటే యన్టీఆర్ సినిమా స్టార్ గా పేరు సంపాదించింది మదరాసులోనే అన్నది వారి వాదన. పైగా శ్రీకృష్ణ పాత్రకు ఆయన పెట్టింది పేరు. కొన్ని తమిళ చిత్రాల్లోనూ శ్రీకృష్ణునిగా నటించి మురిపించారు. ఈ కోణంలో రామారావునే తమ మదారసువాడని చెప్పుకున్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొనే కాబోలు ‘బాహుబలి’ నిర్మాతలు తెలివిగా ఆ సినిమాను తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా పేర్కొన్నారు. అందువల్ల ఆ చిత్రం సాధించిన అపూర్వ విజయాన్ని తమిళులు తమదిగానూ భావించారు. అయితే ఈ సినిమాను నిర్మించినవారు, తెరకెక్కించిన వారు, నటించిన వారిలో అత్యధికులు తెలుగువారే కావడం వల్ల వారు అలా చెప్పుకున్నా, తెలుగు సినిమా పరిధిని పెంచేందుకు ‘బాహుబలి’ సిరీస్ తోడ్పడింది అన్నది నిర్వివాదాంశం. కానీ, ఇప్పుడు ‘పొన్నియన్ సెల్వన్-1’ కు తమిళులందరూ జై కొడుతూ ప్రచారం చేస్తున్నా, ఆ సినిమా ఏ స్థాయిలోనూ ‘బాహుబలి’కి దరిదాపుల్లో లేకుండా పోయిందన్నది వాస్తవం. దానిని తెలుగువారు అదే పనిగా ట్రోల్ చేశారన్న ఉద్దేశంతోనే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ను తమిళ తంబీలు భలేగా ట్రోల్ చేస్తున్నారు. వారికి ‘మీసాల’తో రాముడు కనిపించగానే ‘ఆదిపురుష్’ లోపం ఇట్టే దొరికి పోయింది. మరి, ఈ ట్రోల్స్ ‘ఆదిపురుష్’ విడుదల నాటికి ఏ స్థాయికి చేరతాయో? చెప్పలేము. అయితే ప్రస్తుతం తమిళ స్టార్ హీరోలు తెలుగులో డైరెక్ట్ గా నటిస్తున్న సమయంలో అలా చేస్తే తమిళ సినిమాలకూ తెలుగునేలపై గండి పడే అవకాశం ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకొని ‘ట్రోల్’ రాయుళ్ళు సాగితే మంచిది.