Kaikala Satyanarayana Statue: కృష్ణా జిల్లా గుడివాడలో కాపు సేవా సమితి ఆధ్వర్యంలో నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని.. కైకాల కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. ఎంత చెప్పినా తరగని చరిత్ర కైకాలది అని కొనియాడారు.. కైకాల అంటే మనవాడు అన్న భావన అందరిలో ఉందన్న ఆయన.. వ్యక్తిగా మొదలై లెజెండ్ గా ఎదిగిన మహోన్నతుడు కైకాల సత్యనారాయణ అన్నారు. నాడు మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసిన కైకాల తన ప్రభావంతో.. మాగంటి బాబు, శారదలను గెలిపించారు.. అలాంటి సత్తా ఆయన సొంతం అన్నారు కొడాలి నాని.
Read Also: Brij Bhushan Singh: “రెజ్లర్లు కాంగ్రెస్ ఒడిలో ఉన్నారు”.. వారి కోసం ఉరేసుకోవాలా..?
ఇక, రెండు కోట్ల సీఎస్ఆర్ నిధులతో గుడివాడలో చిరస్థాయిగా నిలిచేలా కైకాల కళామందిరం నిర్మిస్తాం అని ప్రకటించారు ఎంపీ బాలసౌరీ.. సినీ రంగంలో ఎంతమంది ఉన్నా మర్చిపోలేని నటుడు కైకాల సత్యనారాయణ అని పేర్కొన్నారు. మరోవైపు.. విద్యాభ్యాసం పూర్తిచేసుకుని, కళా రంగంలో ఓనమాలు నేర్చుకున్న గుడివాడలో కైకాల విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం అన్నారు కైకాల సోదరుడు నాగేశ్వరరావు. కాగా, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజ నటుడిగా ఎదిగిన దివంగత కైకాల సత్యనారాయణపై గతంలోనూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ప్రశంసలు కురిపించారు. సత్యనారాయణ ఒక మహానుభావుడు అని.. వ్యక్తిగతంగా ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని.. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా గుడివాడ అభివృద్ధికి ఆయన కృషి చేశారని కొనియాడిన విషయం విదితమే.