Brij Bhushan Singh: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) వివాదం దేశంలో చర్చనీయాంశంగా మారింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి సన్నిహితుడైన వ్యక్తి సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా గెలుపొందడాన్ని రెజ్లర్లు తప్పుబడుతున్నారు. ఆయన గెలుపుపై నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రఖ్యాత రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్‌కి గుడ్ బై చెప్పింది. బజరంగ్ పునియా తన పద్మశ్రీని ప్రధాని మోడీకి తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుత వ్యవహారాలపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్ శరణ్ సింగ్ స్పందించారు. నిరసన తెలుపుతున్న రెజ్లర్లు కాంగ్రెస్ ఒడిలో కూర్చున్నారని, వారికి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. మిగతా రెజ్లర్లు ఎవరూ కూడా వారికి సపోర్ట్ చేయడం లేదని చెప్పారు. ఇప్పుడు వారిలో పోరాడేందుకు నేను ఉరి వేసుకోవాలా..? అని ప్రశ్నించారు. 11 నెలలుగా రెజ్లింగ్ అభివృద్ధి కుంటుపడింది, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయని, మా క్యాంపు నుంచి సంజయ్ సింగ్ స్పష్టమైన మెజారిటీతో ఎన్నికయ్యారని అన్నారు. టాప్ రెజ్లర్ సాక్షిమాలిక్ రెజ్లింగ్‌కి వీడ్కోలు చెబితే, నేనేం చేయగలను..? అని ప్రశ్నించారు. నాపై నెలల తరబడి దుర్భాషలాడుతున్నారు.. అలా చేసే హక్కు వారికి ఎవరు ఇచ్చారు..? అని అడిగారు.
Read Also: USA: హిందూ ఆలయంపై దాడి.. ఖలిస్తానీ అనుకూల నినాదాలు..
బ్రిజ్ శరణ్‌పై నిరసన ఎందుకు..?
ఒక మైనర్‌తో సహా ఏడుగురు రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా వంటి టాప్ రెజ్లర్ల బ్రిజ్ శరణ్ సింగ్‌పై ఆరోపిస్తున్నారు. అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. దాదాపు 5 నెలల పోరాటాన్ని రెజ్లర్ల జూన్ నెలలో విరమించారు. అమ్మాయిల ఛాతిపై చేయివేయడం, అనుచితంగా తాకడం వంటి అభియోగాలను అతనిపై మోపారు.