Heavy Rains Today andmorrow in Telangana: హైదరాబాద్ వాతావరణశాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జనగామ, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆగస్ట్ 13 నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. కూలిపోయిన భవనాలు!
ఆదివారం నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 11.05 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 8.93, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 7.28, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 6.70 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. రెండు రోజులుగా హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోయి జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.