కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఐక్యపోరాటాలు చేయాలని తెలంగాణ ప్రతిపక్షాలు నిర్ణయించాయి. గాంధీభవన్లో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఫోర్ పాయింట్ ఫార్ములాను ప్రకటించారు. పోడుభూములతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉమ్మడిగా కార్యక్రమాలు చేపడతామన్నారు నేతలు. తెలంగాణలో భూసమస్యలు, ధరణి వెబ్ సైట్ లోపాలపై సీరియస్ గా పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలిపాయి. గాంధీభవన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి పార్టీలు హాజరయ్యాయి.
ఈ నెల 22వ తేదీన ఇందిరా పార్కు వద్ద భూ సమస్యలపై మహా ధర్నా చేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని రైతులకు పిలుపునిచ్చాయి. ఈ నెల 27 న భారత్ బంద్ ను ఉమ్మడిగా విజయవంతం చేస్తామని తెలిపాయి. ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రజలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్ లో పాల్గొనేలా ప్రణాళిక ఉంటుందని చెప్పాయి. ఈ నెల 30వ తేదీన సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ల కు వినతి పత్రాలు ఇస్తామన్నాయి.
అక్టోబర్ 5న పోడుభూముల సమస్యపై అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు రాస్తారోకో చేస్తామని ప్రకటించాయి. ప్రతిపక్షాల ఐక్య కార్యాచరణ ప్రకటన వెలువడగానే.. ప్రభుత్వ పోడుభూములపై మంత్రులతో సబ్ కమిటీ వేయడంపై ప్రతిపక్షాలు సెటైర్లు వేశాయి. కంటితుడుపు కమిటీలతో తమ పోరాటాలు ఆగబోవని స్పష్టం చేశాయి. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసంగా ఫోర్ పాయింట్ ఫార్ములాను ప్రకటించిన విపక్షాలు.. కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాయి.