Rains : తెలంగాణలో రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. జూన్ 15 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, గురువారం నాటి వాతావరణ సూచనల ప్రకారం, కనీసం 10 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమూ ఉందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు.
అలాగే.. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
WTC Final 2025: మొదటి రోజు బౌలర్లదే.. ఒక్కరోజే నేలకూలిన 14 వికెట్లు..!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మేఘావృత వాతావరణం కొనసాగుతుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 32°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 23°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి తక్కువగానే ఉండనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో హైదరాబాద్‌లో 30°C కన్నా తక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే వర్షాల తీవ్రత పెరిగితే, ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా.
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసర ప్రయాణాలు నివారించాలని, చెట్లు లేదా బలహీన నిర్మాణాల కింద ఆశ్రయం తీసుకోవద్దని అధికారులు హెచ్చరించారు. ఐఎండీ , స్థానిక అధికారుల తాజా సూచనలు పాటిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
Midhun Reddy: లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో కీలక విచారణ..!