Hyderabad: హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిస్సింగ్ లింక్స్ ప్రాజెక్ట్స్ (ఫేజ్-III) కింద రూ.2,410 కోట్లతో 104 లింక్ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. రానున్న రోజుల్లో లింక్ రోడ్ల అభివృద్ధికి సంబంధించిన పనులు గ్రౌండింగ్ కానున్నాయి. వాటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.1,160 కోట్లతో 95.47 కి.మీ మేర మొత్తం 72 రోడ్లు అభివృద్ధి చేయబడతాయి. దాని చుట్టుపక్కల ఉన్న 10 పట్టణ స్థానిక సంస్థలలో 1,250 కోట్లు ఖర్చుతో 103.45 కి.మీ మేర 32 రోడ్లు అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది.
బండ్లగూడ జాగీర్, ఘట్‌కేసర్, కొత్తూరు, దమ్మాయిగూడ, నాగారం, బడంగ్‌పేట్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మణికొండ, జవహర్‌నగర్ కార్పొరేషన్లలో ఈ రహదారులు రానున్నాయి. జీహెచ్ఎమ్సీ పరిధిలోని ప్రాంతాల మధ్యదూరం తగ్గించేందుకు, ప్రభుత్వం లింక్, స్లిప్ రోడ్లను నిర్మిస్తోంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా.. ఆయా ప్రాంతాల ప్రజలకు సులభతర రవాణా సౌకర్యం కల్పిస్తోంది. ప్రధాన కారిడార్‌లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లింక్ రోడ్ల ప్రధాన ఉద్దేశమని హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
Tiger Scare: పులి అడుగు జాడలు గుర్తించిన అధికారులు.. భయాందోళనలో ప్రజలు
గతంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, మొత్తం 126.20 కిలోమీటర్ల పొడవు కలిగిన 135 లింక్ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.అందులో భాగంగా, దాదాపు 572 కోట్లతో 52.36 కిలోమీటర్ల లింక్ రోడ్ల నిర్మాణాలు చేపట్టగా, 273 కోట్ల విలువైన 24 కిలోమీటర్ల పొడవైన పనులు పూర్తిచేశారు. అవి ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో 28.36 కిలోమీటర్ల, 298 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి. పూర్తైన లింక్ రోడ్ల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని మరో 104 రోడ్లు నిర్మించాలని సర్కారు భావిస్తోంది.