Fire Safety Week: తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నేడు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని వట్టినాగులపల్లిలో ఉన్న అగ్నిమాపక శాఖ శిక్షణా కేంద్రంలో ముఖ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అమరవీరుల స్తూపం వద్ద ఆయన ఇతర అధికారులు కలిసి నివాళులు అర్పించారు. రాష్ట్రానికి సేవలందిస్తూ ప్రాణత్యాగం చేసిన అగ్నిమాపక సిబ్బందికి ఇది కృతజ్ఞతాగా నివాళులు అర్పించారు.
వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్టు డీజీ నాగిరెడ్డి తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై శిక్షణలు, ప్రదర్శనలు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ వారోత్సవాలు అగ్నిమాపక సిబ్బందికి ప్రేరణను కలిగించడంతోపాటు, ప్రజల్లో భద్రతపైన అవగాహనను పెంపొందించడంలో కీలకంగా మారనున్నాయి.