CM Revanth Reddy: ఏపీ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారం ఉందని.. ప్రతిపక్షం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అంటూ పేర్కొన్నారు. ఏపీలో ఉంది కేవలం అధికార పక్షమేనని.. ఏపీలో అందరూ బీజేపీ పక్షమేనన్నారు. ఏపీలో ప్రజల కోసం ఉన్నది వైఎస్ షర్మిల మాత్రమే అంటూ రేవంత్ చెప్పుకొచ్చారు. 2029లో షర్మిల ఏపీకి ముఖ్యమంత్రి అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ చెప్పారు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదన్నారు. ఆశయాలు మోసే వారికి మాత్రమే వారసత్వం వస్తుందన్నారు. వైఎస్సార్ 75వ జయంతి వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీలో కాంగ్రెస్ గెలుపుకు కార్యకర్తలు కోసం తెలంగాణ కాంగ్రెస్ అండగా నిలుస్తుందన్నారు. ఏపీలో కాంగ్రెస్ కి అండగా నిలుస్తామని చెప్పటానికి మంత్రి వర్గంతో సహా ఇక్కడకి వచ్చామన్నారు. కడప ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోందని.. అదే జరిగితే కడపలో ప్రతి ఊరు తిరగటానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఎక్కడైతే కాంగ్రెస్‌కి దెబ్బ తగిలిందో అదే కడప నుంచే మళ్ళీ ఏపీ కాంగ్రెస్ జెండా ఎగరవేయటానికి అండగా ఉంటామన్నారు.
Read Also: TDP: టీటీడీ మాజీ ఈవో, మాజీ చైర్మన్‌పై సీఎస్‌కు ఫిర్యాదు.. విచారణ జరిపించండి..
మణిపూర్ పర్యటన వల్ల రాహుల్ గాంధీ వైఎస్సార్ 75వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇక్కడకు రాలేకపోయారని చెప్పారు. తన ప్రతినిధిగా వెళ్ళమని రాహుల్ చెప్పారన్నారు. వైఎస్సార్‌ను శాశ్వతంగా గుర్తు పెట్టుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని.. వైఎస్సార్ అందరి కుటుంబ సభ్యుడిగా ఉండటమే అందుకు కారణమన్నారు. ఎంత గొప్ప నాయకుడైనా ప్రజల మది నుంచి దూరం అవుతారని.. వైఎస్సార్ మాత్రం చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్తూనే ఉన్నారన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరిగినపుడు వైఎస్సార్ లేని లోటుపై చర్చ జరుగుతుందన్నారు. రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని రేవంత్ చెప్పారు. మండలిలో బలమైన వాదన వినిపించి వైఎస్సార్ దృష్టిలో పడేందుకు రాత్రంతా ప్రిపేర్ అయ్యే పరిస్థితి అప్పట్లో ఉండేదన్నారు. సభలో ప్రశ్నించే వారిని ప్రోత్సహించే విధంగా సమాధానం ఇవ్వాలనేది వైఎస్సార్ విధానమన్నారు. ఇది వైయస్ఆర్ నుంచి మేం నేర్చుకున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా వైఎస్సార్ వ్యవహరించిన తీరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు చెప్పే సమస్యలు వినేందుకు సీఎంగా వైయస్ఆర్ సమయం ఇచ్చేవారని రేవంత్ వెల్లడించారు.
వైఎస్సార్ స్ఫూర్తితో రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని.. రాహుల్ పాదయాత్ర వల్ల కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. 100 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష పాత్రను రాహుల్ పోషిస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ అంటేనే మాట తప్పడు మడమ తిప్పడు అంటూ రేవంత్ పేర్కొన్నారు. 20 ఏళ్లు ప్రతిపక్షంలో కొట్లాడితే ఇపుడు సీఎం అయ్యానన్నారు. ఏపీలో ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే షర్మిల కూడా గతంలో వైఎస్సార్ మాదిరి పని చేస్తోందన్నారు. 1999లో వైఎస్సార్ మాదిరి షర్మిల ఇపుడు ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంగా పనిచేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.