TDP: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలపై సీఎస్ నీరభ్ కుమార్‌కు ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్.. సీఎస్‌కు కలిసి ఫిర్యాదు చేశారు.. వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సాంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని, కాబట్టి వారిపై సీబీ సీఐడి లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని కోరారు.. ఈ సందర్భంగా సీఎస్‌కు ఓ లేఖను అందజేశారు టీడీపీ నేతలు..
Read Also: CPI Narayana: రాజకీయాల్లో వైఎస్ విలక్షణమైన వ్యక్తి..
సీఎస్‌కు టీడీపీ రాసిన లేఖలోని అంశాలు:
* సాంప్రదాయానికి విరుద్ధంగా IAS అధికారికి కాకుండా ధర్మారెడ్డిని JEOగా తరువాత EOగా గత ప్రభుత్వం నియమించింది.
* తిరుమల శ్రీవారిని దర్శించుకునే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేస్తూ ఎన్నికల సమయంలో వైసీపీకి విరాళాల సేకరణకు మార్గంగా ధర్మారెడ్డి వ్యవహరించారు.
* తిరుమలలో గెస్ట్ హౌస్‌లకు కేటాయించే భూముల్లో కూడా ధర్మారెడ్డి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ను పాటించలేదు. ఫర్నిచర్ల మార్పు పేరుతో కోట్ల రూపాయిలు పక్కదారి పట్టించారు.
* భక్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా.. రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టేందుకు ధర్మారెడ్డి ఢిల్లీకి తరచూ వెళ్తుండేవారు.
* ధర్మారెడ్డి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే క్రిమినల్ కేసుల్లో ఆయన రాజకీయ ప్రమేయం, కుతంత్రాలు స్పష్టంగా తేటతెల్లమవుతాయి.
* 2 కోట్లు విలువ గల డైమెండ్ వాచ్‌ను హైకోర్టు జడ్జికి ఆఫర్ చేసారనే వదంతులు కూడా ధర్మారెడ్డిపై ఉన్నాయి.
* మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలిద్దరూ బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా సివిల్ కాంట్రాక్టులకు టీటీడీ నిధులను పక్కదారి పట్టించారు.
* బడ్జెట్ పరిమితిని అధిగమించి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రూ. 475 కోట్లకు పెంచగా.. అనంతరం చైర్మనైన కరుణాకర్ రెడ్డి భారీగా రూ.1,772 కోట్లకు పెంచి తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారు.
* ఎన్నికల్లో అభినయ్ రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలు తెగబడ్డారు.
* శ్రీవాణి టికెట్లు పేరుతో రూ.10,500 వసూలు చేసి ఆ డబ్బులు ఏ రకంగా ఖర్చు చేశారో చూపించలేదు.
* ఎవరు టీటీడీకి విరాళాలు ఇచ్చినా అవి శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్‌లోకి జమవ్వడంతో టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఏ పని అయినా చేసుకునేలా అవకాశం కల్పించారు.
* పద్మావతి ఆస్పత్రి (రూ.550 కోట్లు), బాలాజీ ఇన్స్‌టిట్యూట్(రూ.324 కోట్లు), స్విమ్స్ కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణాల్లో కూడా భారీ అక్రమాలకు పాల్పడ్డారు.
* ఆసుపత్రుల నిర్మాణానికి రూ.1 కోటి నుంచి 1.5 కోట్లు విరాళం ఇచ్చే భక్తులకు 531 ఉదయాస్తమన సేవా టికెట్లు ఇచ్చి భారీ కుంభకోణానికి తెర లేపారు.
* రూ.200 కోట్లతో తిరుమలలో కర్ణాటక ప్రభుత్వ యాత్రా సముదాయం నిర్మాణం విషయంలో టీటీడీ కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిర్మాణ పనులు చేపట్టడానికి అనుమతించాలని ఒత్తిడి తెచ్చింది.
* తిరుమలలో గెస్ట్ హౌస్‌ల నిర్మాణం మరియు విరాళాల విషయంలో వ్యక్తిగత దాతల విషయంలో టీటీడీ పూర్తిగా భిన్నమైన పద్ధతిని అవలంభించింది.
* తిరుమల కాంప్లెక్స్ 5 నిర్మాణంలో రూ.98 కోట్లు కమిషన్ల రూపంలో పక్కదారి పట్టాయి.
* వైసీపీ బడా నాయకుల సిఫార్సు చేసిన వారినే టీటీడీలోని సలహాదారులను, ఉద్యోగులుగా ధర్మారెడ్డి నియమించారు.
* ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై సీబీ సీఐడి లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించి అక్రమాలను వెలుగు తీయాలి.. అంటూ సీఎస్‌కు ఫిర్యాదు చేసిన లేఖలో పేర్కొన్నారు టీడీపీ నేతలు.