NTV Telugu Site icon

CM Revanth Reddy : చేసిన తప్పులు, అప్పులను ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ను ఓడించి, ఆయనను సీఎం పదవి నుంచి తొలగించిందీ తానేనని రేవంత్ స్పష్టం చేశారు. ఇక ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పూర్తిగా ఓటమి దక్కిందంటే, దానికి కారణం తానేనని కేటీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. “స్టేటస్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అసలు కేటీఆర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?” అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన అక్కసుతోనే కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతేకాక, కేసీఆర్ అసెంబ్లీలో వర్చస్సు చూపే స్థాయిలో లేరని వ్యాఖ్యానించారు.

కేటీఆర్‌కు ఎలాంటి భయం లేదన్న వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్, “క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరు. భయపడితే క్రైమ్ చేయరు. అందుకే కేటీఆర్ భయపడను అంటున్నారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గురించి మాట్లాడటమే అనవసరమని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సీఎం రేవంత్, “కిషన్ రెడ్డి నేనే మెట్రో తెచ్చానంటున్నారు. అసలు కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు తెచ్చే ఉంటే, తానే స్వయంగా సన్మానిస్తానని సీఎం స్పష్టం చేశారు.

“కనీసం అఖిలపక్ష సమావేశానికి కూడా కిషన్ రెడ్డి రాలేదు. కేంద్రం నుంచి నిధులు తెస్తే తాము తిరస్కరించమా? రింగ్ రోడ్డు అంటే పూర్తి వలయాకారంలో ఉండాలి. కానీ సగం ఇచ్చి దాన్ని రింగ్ రోడ్డంటూ ఎలా అంటారని?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర సమస్యలపై ఉమ్మడి పోరాటం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినా, బీజేపీ నేతలు హాజరుకాలేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై భయంతోనే కిషన్ రెడ్డి సమావేశానికి రాలేదేమోనని ఎద్దేవా చేశారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడడంలో బీజేపీ వైఫల్యం చెందిందని ఆరోపించిన సీఎం రేవంత్, “బుల్లెట్ ట్రైన్ గుజరాత్‌కు ఇచ్చారు. కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు?” అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ చెల్లించే పన్నులతో పోల్చితే, కేంద్రం నుంచి రాబడే నిధులు ఎంత తక్కువగా ఉన్నాయో ప్రజలకు అర్థమయ్యేలా చర్చకు రావాలని సవాల్ విసిరారు. “కిషన్ రెడ్డికి ధైర్యముంటే ఈ అంశంపై చర్చకు రావాలి. నేను సీఎం భట్టి విక్రమార్క్‌తో సహా చర్చకు సిద్ధమే” అని ప్రకటించారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని సార్లయినా ఢిల్లీకి వెళ్లేందుకు తాను వెనుకాడనని స్పష్టం చేశారు. “ఢిల్లీ వెళ్లడం వల్లనే హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన అనుమతులు రావడానికి సహాయపడింది” అని రేవంత్ అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో అసలు పోటీకి కూడా దిగకుండా తప్పించుకున్నది బీఆర్ఎస్ కాదా?” అని రేవంత్ ప్రశ్నించారు. హరీశ్ రావు లాంటి నేతలు రాజకీయంగా తప్పించుకునేందుకు దొంగ దెబ్బ తీశారని విమర్శించారు. మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను బీజేపీ వ్యాఖ్యలతో పోల్చుతూ, రెండు ఒకటేనని కొట్టిపడేశారు. ఏపీలో వర్గీకరణ సమస్యపై ఏ విధమైన చర్యలు చేపట్టలేదని తిప్పికొట్టారు. SLBC ప్రాజెక్టును గతంలోనే పూర్తి చేసి ఉంటే, కొండపల్లి ఘటనలో ప్రాణనష్టం జరిగేది కాదని రేవంత్ అన్నారు. అంతేకాకుండా, ప్రజల మరణాలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దురదృష్టకరమని ఆయన ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.

SP Ranganath: ఓ పోలీస్ దర్యాప్తు అధికారిగా గర్వపడుతున్నాను