ఈ మధ్య రీల్స్ పిచ్చి పీక్స్ కు వెళ్లిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరు రీల్స్ అంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. మెట్రో లేదు, రోడ్డని లేదు ఆఖరికి పవిత్రమైన గుడిలో కూడా ఇష్టమొచ్చినట్లు రీల్స్ చేసి ఇక్కట్ల పాలైన వారు ఉన్నారు. ఇప్పుడు ఏకంగా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే రీల్స్ పిచ్చితో విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తున్నారు. స్కూల్ లోనే వీడియోలు చేస్తూ వాటిని లైక్ షేర్ చేయాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగింది.
Also Read:
అమ్రోహా జిల్లాలో కొన్ని ప్రాథమిక పాఠశాలల టీచర్లు విద్యార్థులను గాలికి వదిలేసి రీల్స్ షూట్ చేయడంలో మునిగిపోతున్నారు. ఓ టీచర్ రీల్స్ చేస్తుంటే మరో టీచర్ దానిని కెమెరాలో షూట్ చేస్తుంటారు. స్కూల్ కు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు ఇదే పనిగా మారిపోయింది వారికి . ఇదే విషయాన్ని తమ తల్లిదండ్రుల వద్ద మొరపెట్టుకొని బాధపడుతున్నారు. అంతేకాదు వాటిని తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తూ లైక్ చేసి, షేర్ చేయాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అంతేకాదు అలా చేయకపోతే వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు.
స్కూల్లో రీల్స్ రికార్డ్ చేస్తున్న టీచర్లను అంబికా గోయల్, పూనమ్ సింగ్, నీతూ కశ్యప్‌గా విద్యార్థులు పేర్కొంటున్నారు. అంతేకాదు వారు విద్యార్థుల చేత వంట, టీ చేయించడం లాంటి పనులు కూడా చేయిస్తున్నారు. ఈ విషయాలు తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కలెక్టర్ ను కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే ఆ టీచర్లు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. పిల్లలు నేర్చుకుంటారని కొన్నిసార్లు మాత్రం వీడియోలు చేసినట్టు చెబుతున్నారు. విద్యార్థులు మాత్రం స్కూల్ కు వచ్చినప్పటి నుంచి ఇదే పనిగా పెట్టుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. స్కూల్‌లో రీల్స్ వ్యవహారంపై బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి గంగేశ్వర్ ఆర్తి గుప్తా దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.