Kesineni Nani: బెజవాడ ఎంపీ స్థానంపై కొత్త ఈక్వేషన్ తెర మీదకు తెచ్చారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. నిఖార్సైన బీసీకి బెజవాడ ఎంపీ టిక్కెట్ ఇస్తే సహకరిస్తానని కేశినేని నాని పేర్కొన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్లల్లో ఉన్న బీసీలకు సహకరించనంటూ బుద్దా వెంకన్నపై నాని పరోక్ష కామెంట్లు చేశారు. బెజవాడ ఎంపీ సీటు బీసీకి ఇవ్వాలనే ప్రతిపాదన మంచిదే.. ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్థికంగా వెనుకబడి, నిజాయితీగా ఉన్న బీసీకి టిక్కెట్ ఇవ్వాలన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ వంటి కేసుల్లో ఉన్న బీసీలకు టిక్కెట్ ఇస్తే సహకరించనని చెప్పారు.
Read Also: CM YS Jagan: ఎమ్మెల్యేలతో కొనసాగుతున్న సీఎం జగన్ వరుస భేటీలు
ప్రజల్ని హింసించి.. కబ్జాలు చేసి.. కోట్లాది రూపాయలు సంపాదించిన వాళ్లు బీసీలు కాదన్నారు. బెజవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ లాంటి వాళ్లు మంచి బీసీలు అంటూ వ్యాఖ్యానించారు. మంచి బీసీ నేత అయితే వాళ్ల కాళ్లకు దండం పెడతానని.. మంచి బీసీలు వండి పెడితే వాళ్లింటికి వెళ్లి తింటానన్నారు. నిజాయితీ గల బీసీలకు ఎంపీగా అవకాశమిస్తే దగ్గరుండి గెలిపించుకుంటామన్నారు. ప్రజల కోసం.. రాష్ట్రం కోసం జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందన్న ఆయన.. ఓటమి భయంతోనే టీడీపీ – జనసేన పొత్తుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.పొత్తులనేవి దేశంలో కొత్తేం కాదని.. భావసారూప్యత కలిగిన వాళ్లు పొత్తులు పెట్టుకోవడం సహజమేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని చెప్పుకొచ్చారు.