తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని, నిన్న హైడ్రా కూల్చివేసిన సర్వే నంబర్‌పై ఎలాంటి కేసు లేదని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 79/1, 79/2 సర్వే నంబర్ రెగ్యులరైజ్ అయ్యిందని.. గతంలో అన్ని సీలింగ్ ల్యాండ్స్ తో పాటు తమది కుడా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారన్నారు. అన్ని డాక్యుమెంట్స్ నెల రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి స్వయంగా అందించానని, ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేశారని మండిపడ్డారు. హైడ్రా కమిషనర్ చర్యలపై రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నామని, కోర్టులపై తమాకు పూర్తి నమ్మకం ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు.
‘నేను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు. నిన్న హైడ్రా కూల్చివేసిన సర్వే నంబర్‌పై ఎలాంటి కేసు లేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 79/1, 79/2 సర్వే అర్బన్ సీలింగ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లో రెగ్యులరైజ్ అయ్యింది. గతంలో అన్ని సీలింగ్ ల్యాండ్స్ తో పాటు మాది కుడా ప్రోహిబియేట్ లిస్ట్ లో పెట్టారు. అప్పటి జిల్లా కలెక్టర్‌ని కలిసి రెగ్యులరైస్ చేసిన డాక్యుమెంట్ చూపించడంతో.. ప్రోహిబియేట్ లిస్ట్ నుండి తొలగించారు. దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ నెల రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి స్వయంగా అందించాను. ఏమైనా డిఫరెంట్ ఉంటే మళ్లీ పిలుస్తామని కమిషనర్ చెప్పారు. కానీ ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేశారు. నిన్న కూల్చివేతలు చేసిన స్థలంలో సుప్రీం కోర్టులో ఉన్న 7 కేసుల వివరాలు పెట్టారు. ఆ 7 కేసుల్లో మా సర్వే నంబర్‌కి ఎక్కడా సంబంధం లేదు. హైడ్రా కమిషనర్ చర్యలపై రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నాం. కోర్టులపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
హైదరాబాద్ హఫీజ్ పేటలో ఉన్న 17 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అందులో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన ఆఫీసు, షెడ్లు కూడా ఉన్నాయి. రెండు వేల కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిలో షెడ్లను నిర్మించి.. సినిమా షూటింగ్‌లకు సంబంధించిన పరికరాలను ఉంచారు. ఈ షెడ్లను హైడ్రా అధికారులు శనివారం కూల్చివేశారు. హైడ్రా చర్యలపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు.