AP High Court: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్ లు ఏర్పాటు అయ్యాయంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. ఓటరుకు 2 కిలో మీటర్లకు మించిన దూరంలో పోలింగ్ బూత్ లు ఉండకూడదనే నిబంధన ఉన్నా.. 3 కిలో మీటర్ల దూరంలో 7 బూత్ లు ఏర్పాటు చేసినట్టు తన పిటిషన్‌లో హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.. ఒకే పోలింగ్ స్టేషన్ లో 4 బూత్ లు ఉండకూడదనీ నిబంధన ఉన్నా పాటించలేదని కోర్టుకు విన్నవించారు. ఇక, ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్ని వినతులు ఇచ్చినా.. చర్యలు లేవని కోర్టుకు తెలిపిన పిటిషనర్.. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది హైకోర్టు.. ఈ వ్యవహారంలో ఈ నెల 22వ తేదీ లోపు గద్దె రామ్మోహన్ వినతులపై ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.