Bode Prasad: రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని వెంటనే గిట్టుబాటు ధరకు సేకరించాలని ఆయన సర్కారును కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ రైతులతో కలిసి పెనమలూరు నియోజకవర్గంలో ఆయన నిరసన చేపట్టారు. ఎప్పుడో జనవరిలో ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు డబ్బులు జమ చేయకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు గురించి జగన్ మరీ మరీ మాట్లాడుతారని.. కానీ ఇప్పుడు రైతు దగా కేంద్రాలుగా మారాయన్నారు. ఐదేళ్ల నుంచి రైతాంగం సంక్షోభంలో ఇరుక్కుపోయిందని.. వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదన్నారు టీడీపీ నేత బోడె ప్రసాద్. ఇటీవల తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు సహాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనవరి నుంచి ఉన్న బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని ఆయన కోరారు. ఇప్పుడు ధాన్యం సేకరించపోవడంతో పూర్తి స్థాయిలో సేకరణ అనేది దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.