TDP: ఏపీలోని విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. విశాఖ జిల్లా నేతలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులుగా పోటీలో నిలిపేందుకు ఆయన సమాలోచనలు చేశారు. ఆయనతో పాటు ఉపఎన్నికల్లో పోటీచేయాలా లేదా అనే విషయంపై కూటమి పార్టీలు తర్జనభర్జన పడ్డాయి. సరైన బలం లేకపోవడంతో చివరికి పోటీ నుంచి తప్పుకున్నాయి. వైసీపీకి మెజార్టీ సభ్యుల మద్దతు ఉండటంతో పోటీ చేయకపోవడమే మంచిదని నిర్ణయించారు. ప్రస్తుతం వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థి షేక్ సఫీ పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
Read Also: Siddaramaiah: నేడు తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించనున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోయినా బొత్స విజయం లాంఛనమే కానుంది. ఎందుకంటే.. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది జడ్పీటీసీలు, 97 మంది కార్పొరేటర్లు, 53 మంది కౌన్సిలర్లు, మరో 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మరో ముగ్గురు వైసీపీ ఎక్స్ ఆఫీషియో కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉండగా, వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి. విపక్ష వైసీపీకి 615 మంది ప్రజాప్రతినిధులు ఉండగా, టీడీపీకి 214 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇరు పార్టీల మధ్య 400 మంది తేడా ఉంది. ఈ నేపథ్యంలో బొత్స గెలుపు సులభం కానుంది.