TDP Survey: కృష్ణా జిల్లాలో కాక రేపుతున్నాయి తాజా రాజకీయ పరిణామాలు.. మైలవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్లా తెలుగుదేశం పార్టీ సర్వేలు చేపట్టింది.. రెండు చోట్లా టీడీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లతో సర్వే నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. మైలవరం నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వసంత కృష్ణప్రసాద్.. అయితే, వసంత టీడీపీలో చేరుతారని సోషల్ మీడియాలో గత కొంతకాలంగా విస్తృత ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పెనమలూరు వైసీపీ అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్‌ను ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.. దీంతో.. మంత్రి జోగి రమేష్ టార్గెట్ గా వసంత కృష్ణప్రసాద్ పోటీకి దిగుతారని ప్రచారం జోరుగా సాగుతోంది.
Read Also: Minister Venugopala Krishna: నిజం అంటే జగన్.. ఇది ప్రజల నమ్మకం..
అంతే కాదు.. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య మైలవరం కేంద్రంగా ఇప్పటికే వర్గపోరుతో గ్యాప్ వచ్చింది.. జోగి జోక్యంతో పడిన ఇబ్బందుల్ని పలుమార్లు వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేకపోవటంతో వసంత అసంతృప్తిగా ఉన్నట్టు స్థానికంగా ప్రచారం సాగుతోంది.. ప్రస్తుతం పెనమలూరు అభ్యర్ధిగా ఉన్న జోగి రమేష్, తిరిగి మైలవరం అభ్యర్ధిగా వెళ్తారని ప్రచారం కూడా మరోవైపు సాగుతోందట.. దీంతో జోగి రమేష్ పోటీ చేసే అవకాశం ఉన్న పెనమలూరు, మైలవరం రెండు చోట్లా టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ పేరుతో టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోందని.. అందుకే ఆయన పేరు సర్వే చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులే ఉన్నారు.. దానికితోడు.. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయనకు మరో నియోజకవర్గాన్ని టీడీపీ అధిష్టానం ఖరారు చేసిందనే చర్చ సాగుతోంది. ఇలా వరుస పరిణామాలు ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి.