TDP – BJP – Jana Sena Alliance: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో అసమ్మతి సెగలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు బెజవాడ పశ్చిమ సీటు.. ఇప్పుడు పెడన, అవనిగడ్డ. ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో కుంపటి రాజుకుంటూనే ఉంది. పెడనలో అసంతృప్తి రగులుతోంది. పెడన టికెట్ ఆశించిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్.. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో పెడన పాలిటిక్స్.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి తలనొప్పిగా మారాయి. అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని వ్యవకిరేకిస్తూ.. జనసేన నేతలు రాజీనామాలు చేస్తున్నారు. వారితో చర్చలు జరిపేందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్‌ను రంగంలోకి దించారు పవన్ కల్యాణ్. మండలి బుద్దప్రసాద్, మండలి రాజేష్ ఇద్దరూ కలిసి.. జనసేన లోకల్ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారిని బుజ్జగించి.. కలిసి పనిచేసేలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: Uddhav Thackrey : అది ‘నకిలీ శివసేన’ అన్న ప్రధాని.. ఇది మీ డిగ్రీలా నకిలీ కాదన్న ఉద్ధవ్ ఠాక్రే
ఇటు తిరువూరు టీడీపీలోనూ ముసలం పుట్టింది. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిగా మారింది వ్యవహారం. టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ అభ్యర్థిత్వం మార్చాలని కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. కొందరు స్థానిక నేతలు పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నీని కలిసి అభ్యర్థిని మార్చాలన్నారు. కొలికపూడిని మార్చి శ్రీదేవికి టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే ఇదంతా ఉండవల్లి శ్రీదేవి చేయిస్తున్నట్లు కొలికపూడి వర్గం ఆరోపిస్తుంది. దీంతో అక్కడ కొత్త కుంపటి మొదలైంది. మరోవైపు.. ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు, కందుకూరు టీడీపీలో అసమ్మతి రాజుకుంది. గిద్దలూరు, కందుకూరు సెగ్మెంట్లలో అసంతృప్త నేతలు పోటీకి సిద్ధమయ్యారు. గిద్దలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్‌రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. కూటమి నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు జనసేన నేత ఆమంచి స్వాములు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ అభ్యర్థిగా.. ఇంటూరి నాగేశ్వరరావును ప్రకటించింది అధిష్ఠానం. టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు ఇంటూరి రాజేష్.
Read Also: AP Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ..!
ఇక, ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి తలనొప్పులు తప్పటంలేదు. టీడీపీ, బీజేపీని అంతర్గత విబేధాలు పట్టిపీడిస్తున్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ సమస్యలు ఎదుర్కొంటోంది. బీజేపీ పోటీ చేసిన ఒకే ఒక్క నియోజకవర్గంలో నేతల మధ్య కుమ్ములాటలు బయటపడుతున్నాయి. ఆదోనిలో లుకలుకలు మూడు పార్టీలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. అటు.. ఎమ్మిగనూరులో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఎంతకీ సయోధ్య కుదరటం లేదు. ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, శ్రీశైలంలో టీడీపీకి సమస్యలు ఎదరవుతున్నాయి.. మరోవైపు, కడప జిల్లా రాజంపేట టీడీపీలో అసమ్మతి జ్వాల రగులుతోంది. టికెట్ ఆశించిన బత్యాల చెంగల్ రాయుడు.. పార్టీ ప్రకటించిన అభ్యర్థితో ఢీకొడుతున్నారు. పోటీపోటీగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బత్యాల తీరు.. టీడీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. అయనకు సద్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం మాత్రం కనిపించటంలేదు. నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతలు.. పోటాపోటీ ప్రచారాలతో.. తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు.