Defamation Case: పరువు నష్టం కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2001లో డిఫెన్స్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. 2002లో మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లూవాలియా పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో తెహల్కా పత్రిక, తరుణ్ తేజ్‌పాల్‌తో పాటు మరో ఇద్దరు పాత్రికేయులు రెండు కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నిజాయితీపరుడైన ఆర్మీ అధికారి ప్రతిష్టకు తీవ్ర హాని కలిగించేలా ఇంత కఠోరమైన కేసు మరొకటి ఉండదని పేర్కొంటూ.. ప్రచురణ జరిగి 23 సంవత్సరాల తర్వాత క్షమాపణ చెప్పడం మాత్రమే తగదని, అది అర్థరహితమని న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ అభిప్రాయపడ్డారు.
Also Read: PF Withdraw: ఇలా చేస్తే.. పీఎఫ్ అకౌంట్ నుంచి 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు..!
మార్చి 13, 2001న, కొత్త రక్షణ పరికరాల దిగుమతికి సంబంధించిన రక్షణ ఒప్పందాలలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ న్యూస్ పోర్టల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. రక్షణ రంగానికి సంబంధించి కొనుగోలు ఒప్పందాల్లో మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లూవాలియా మధ్యవర్తిగా వ్యవహరించి అవినీతికి పాల్పడ్డారంటూ 2001లో తెహల్కా ప్రచురించింది. ఈ విషయంపై అహ్లూవాలియా కోర్టుకు వెళ్లగా.. ఈ కేసుకు సంబంధించి వాదనలు విన్న ఢిల్లీ కోర్టు రూ.2కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలతో ఆయన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని.. ఆయనపై వచ్చిన వార్తలు తప్పని తేలినా.. అనుభవించిన వేదనను నయం చేయలేమని పేర్కొంది.