చెన్నై విమానాశ్రయంలో ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ ఓ రిపోర్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. తనని రాజకీయ ప్రశ్నలు అడగవద్దని ఆగ్రహానికి గురయ్యారు. రజనీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్తున్న రజనీ.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనను ఉద్దేశిస్తూ.. ఓ రిపోర్టర్ మహిళల భద్రతపై ప్రశ్నించారు. తనని రాజకీయ ప్రశ్నలు అడగవద్దని ముందే చెప్పానంటూ సూపర్ స్టార్ అసహనం వ్యక్తం చేశారు.
కూలీ సినిమా షూటింగ్ అప్‌డేట్‌ను రజనీకాంత్ అభిమానులతో పంచుకున్నారు. ‘కూలీ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. జనవరి 13 నుంచి జనవరి 28 వరకు మరో షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో జరగనుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు పంచుకుంటా’ అని సూపర్ స్టార్ చెప్పారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న కూలీకి అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతిహాసన్ కీలక పాత్రలు చేస్తున్నారు. లియో తర్వాత లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న సినిమా ఇదే.