Rare Treatment : హైదరాబాద్లోని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. బాల్యంలో ప్రమాదవశాత్తు పురుషాంగాన్ని కోల్పోయిన సోమాలియాకు చెందిన యువకుడికి (20) వైద్యులు అత్యాధునిక పద్ధతులతో కొత్త జీవితం ఇచ్చారు. ఈ సమగ్ర చికిత్స ద్వారా అతడి చేతిపై పురుషాంగాన్ని అభివృద్ధి చేసి, తర్వాత శస్త్రచికిత్స ద్వారా తన శరీరంలోని సహజ స్థితికి అనుసంధానం చేశారు.
బాల్యంలో జరిగిన ప్రమాదం
చికిత్స పొందిన యువకుడికి నాలుగేళ్ల వయసులో సున్తీ (సర్జికల్ సర్కంసిజన్) సమయంలో ఇన్ఫెక్షన్ సోకింది. పరిస్థితి విషమించడంతో డాక్టర్లు అతడి పురుషాంగాన్ని తొలగించాల్సి వచ్చింది. చిన్న వయసులోనే అతడి మూత్ర మార్గాన్ని సవరించి, వృషణాల కింద నుంచి మూత్ర విసర్జన జరిగేలా ఒక మార్గాన్ని రూపొందించారు. అయితే, 18 ఏళ్ల వయసులోకి చేరిన తర్వాత అతడికి మూత్ర విసర్జనలో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయి. తగిన చికిత్స కోసం అతడు హైదరాబాద్ మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రిని ఆశ్రయించాడు.
అరుదైన శస్త్రచికిత్స
వైద్యులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, క్రమబద్ధమైన చికిత్స ప్రణాళిక రూపొందించారు. మొదట అతడి మూత్ర విసర్జన సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక శస్త్రచికిత్స చేశారు. తర్వాత అతడి శరీరంలోని వివిధ భాగాల నుంచి కండరాలు, నరాలు, రక్తనాళాలను సేకరించి, పురుషాంగాన్ని మళ్లీ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ఈ ప్రత్యేక శస్త్రచికిత్సలో, మైక్రోవాస్క్యులర్ సర్జరీ సాంకేతికతను ఉపయోగించారు. తొడ, పొట్ట, మోచేతి భాగాల నుంచి అవసరమైన కణజాలాలను సేకరించి, “రేడియల్ ఆర్టెరీ ఫోర్ ఆర్మ్ ఫ్లాప్” విధానంలో పురుషాంగాన్ని అభివృద్ధి చేశారు. దీనిని ముందుగా అతడి చేతిపై పెంచి, పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత శస్త్రచికిత్స ద్వారా శరీరంలోని సహజ స్థానంలో అమర్చారు.
విజయవంతమైన ఫలితాలు
ఈ శస్త్రచికిత్స తర్వాత యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. అతడికి పినైల్ ఇంప్లాంట్ ఏర్పాటు చేయడంతో, ఇప్పుడు సాధారణ వ్యక్తిలా నిలబడి మూత్ర విసర్జన చేయగలుగుతున్నాడు. వైద్యుల ప్రకారం, అతడికి స్పర్శ సామర్థ్యం తిరిగి వచ్చింది, అలాగే సాధారణ దాంపత్య జీవితం కూడా గడపగలుగుతాడు.
వైద్య విజయం – ఒక కొత్త జీవితం
ఈ అరుదైన ఆపరేషన్ ద్వారా యువకుడికి సాధారణ జీవితం గడపడానికి అవకాశం కల్పించడమే కాకుండా, ఆయన మానసిక బాధలకు చెక్ పెట్టారు వైద్యులు. “ఇన్నేళ్లు మానసిక క్షోభ అనుభవించాను, కానీ ఇప్పుడు చాలా సంతోషంగా నా దేశానికి తిరిగి వెళ్తున్నాను,” అని బాధితుడు ఆనందం వ్యక్తం చేశాడు.
మెడికవర్ ఆసుపత్రి వైద్యుల శ్రమ, అధునాతన వైద్య పద్ధతుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి ఆపరేషన్ తొలిసారి విజయవంతమైంది. వైద్యశాస్త్రంలో జరిగిన ఈ అద్భుత విజయంతో, భవిష్యత్తులో మరింత మందికి అండగా నిలిచేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Shabbir Ali : అమెరికాతో మాట్లాడే దమ్ము కేంద్రానికి లేదు