రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ‘యువత పోరు’:
రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైసీపీ సిద్ధమైంది. ‘యువత పోరు’ పేరుతో ధర్నా కార్యక్రమంను నేడు వైసీపీ చేపట్టనుంది. ఈరోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు నాయకులు, కార్యకర్తలు చేయనున్నారు. అనంతరం వైసీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మోసాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నినదించనున్నారు. అంతేకాదు ధర్నాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువతతో కలిసి వైసీపీ పోరుబాకు సిద్ధమైంది. అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీకి సన్నద్ధం అయింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు 4,600 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయనున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సింది రూ.7,100 బడ్జెట్లో కేటాయింపులు 2,600 కోట్లే అని వైసీపీ అంటోంది. తన హయాంలో 18,663.44 కోట్లు ఇచ్చానని వైఎస్ జగన్ అంటున్నారు. 16,347 పోస్టులతో డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసినా.. ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ హామీ 9 నెలలు గడుస్తున్నా వెలువడలేదని ‘యువత పోరు’లో విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వంను ఎండగట్టడానికి సిద్దమయ్యారు.
బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో ట్విస్ట్:
వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. ఇవాళ ఉదయం 6.30కి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన లొంగిపోయారు. హైకోర్ట్ ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు అనిల్ తిరిగి వచ్చారు. నిన్న సాయంత్రం 5 గంటలకే మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. అయితే గడువు ముగిసిన 12 గంటల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్ తిరిగి హాజరు అయ్యారు. తన మధ్యంతర బెయిల్ మరోసారి పొడిగించాలని బోరుగడ్డ అనిల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళావారం విచారణ జరిగింది. బెయిల్ పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. తక్షణమే లొంగిపోవాలని హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న గడువులోగా సెంట్రల్ జైలుకు తిరిగి రాకపోవడంతో.. రాజమండ్రి జైలు అధికారులు హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ పై కోర్టు ధిక్కరణ నేరం కింద పరిగణించే అవకాశం ఉంది. తల్లికి అనారోగ్యం పేరుతో ఇటీవల ఆయన బెయిల్ పొందారు. ఈ నెల 1న మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నారు. టీడీపీ నేతలను దూషించిన కేసులో బోరుగడ్డ అనిల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
భారీగా కల్తీ నిత్యవసర వస్తువుల పట్టివేత:
హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో భారీగా కల్తీ నిత్యవసర వస్తువుల తయారీని పోలీసులు గుర్తించి దాడి నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొని 20 రకాల కిరాణా వస్తువులను స్వాధీనం చేసుకుంది. కల్తీ వ్యాపారస్తులు ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి పలు నిత్యవసర వస్తువులను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేటుగాళ్లు ప్రజల్లో ఎక్కువగా వినియోగించే ప్రముఖ బ్రాండ్లను టార్గెట్ చేసి కల్తీ ఉత్పత్తులను తయారు చేశారు. వీటిని అసలు బ్రాండ్‌ల ప్యాకింగ్‌లోనే మార్కెట్‌లోకి వదిలి వినియోగదారులను మోసం చేస్తున్నారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం ఈ నకిలీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కల్తీ వ్యాపారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.
19వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్:
టన్నెల్ ప్రమాదం జరిగిన తర్వాత కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరుకుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. GPR (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్), క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. చికుక్కున ఏడుమంది మృతదేహాల కోసం విస్తృత చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల ఉన్న ప్రమాదకర ప్రాంతాలను తవ్వేందుకు రోబోలను వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబోటిక్ సంస్థ ప్రతినిధులు సహాయక చర్యల్లో రోబోల వినియోగంపై అధ్యయనం చేశారు. మంగళవారం రోబోలకు సంబంధించిన ఇన్‌స్టలేషన్ సామగ్రితో టన్నెల్ వద్దకు చేరుకుని మాస్టర్ రోబో, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరికరాలను క్యాంపు కార్యాలయంలో సిద్ధం చేశారు.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు:
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 13) ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ భవనంలో ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగనుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల వ్యవధి, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 14న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఆ తీర్మానం ఆమోదం పొందిన తరువాత సభ వాయిదా పడనుంది.
గోల్డ్ స్మగ్లింగ్‌లో రన్యారావు భర్త పాత్ర:
బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. డీఆర్ఐ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తు్న్నారు. ఈ కేసులో అరెస్టైన నటి రన్యారావు దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ దిశగా దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఇటీవల ఆమె స్నేహితుడు తరుణ్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడితో రన్యారావు సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. తాజాగా రన్యారావు భర్త జతిన్ హుక్కేరిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. స్మగ్లింగ్‌లో ఇతడి ప్రమేయం కూడా ఉన్నట్లుగా గుర్తించారు. జతిన్ హుక్కేరి ప్రముఖ ఆర్కిటెక్ట్. పబ్‌లు, లాంజ్‌లను డిజైన్ చేయడంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అయితే భార్య రన్యారావు బంగారం స్మగ్లింగ్‌లో జతిన్ హుక్కేరి పాత్ర కూడా ఉన్నట్లుగా ఆధారాలు సేకరించారు. అతడి ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
భోజ్ పురిలో మాట్లాడిన మోడీ:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం మారిషస్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మారిషస్ లోని హిందువులను కలుసుకున్నారు. అందులో మెజార్టీ ప్రజలు భోజ్ పురి వాళ్లే ఉండటంతో వారిని ఉద్దేశించి ప్రధాని భోజ్ పురిలో బాగున్నారా అంటూ పలకరించారు. బీహార్ తో మీకున్న బంధాన్ని అర్థం చేసుకున్నానంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీహార్ ఫేమస్ వంటకం అయిన మఖానా గురించి మాట్లాడారు. “ఇప్పుడు అందరూ బీహార్ వంటకం మఖానా గురించే మాట్లాడుకుంటున్నారు. అతి త్వరలోనే ప్రపంచ మెనూలో మఖానా చేరుతుందని” జోస్యం చెప్పారు. బీహార్ కు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా గుర్తింపు తెస్తోందన్నారు.
టెస్లా కారు కొనుగోలు చేసి స్వయంగా నడిపిన ట్రంప్:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం కొత్త టెస్లా కారు కొనుగోలు చేశారు. ఎరుపు రంగు టెస్లా కారును కొనుగోలు చేశారు. అనంతరం కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్‌తో కలిసి ట్రంప్ కలియ తిరిగారు. తన స్నేహితుడికి మద్దతుగా కొత్త టెస్లా కారు కొంటున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ కారు కొనుగోలు చేసి వైట్‌హౌస్ ఎదుట డ్రైవింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డ్రైవింగ్ సీటులో కూర్చోగా.. మస్క్ పక్కసీటులో కూర్చున్నాడు. ఇద్దరూ కూడా ఉల్లాసంగా ఉన్నట్లు కనిపించారు. కారు చాలా అందంగా ఉందని ట్రంప్ ప్రశంసించారు. ఇక కారు ఎలా స్టార్ట్ చేయాలో ఇద్దరూ సంభాషించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారు గంటకు 95 కిలోమీటర్లు వెళ్తోంది.
100 మంది బందీలను రక్షించిన పాకిస్తాన్ సైన్యం:
బలూచిస్తాన్‌లోని బోలాన్ జిల్లా సమీపంలో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలును మంగళవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపి హైజాక్ చేశారు. ఈ చర్యతో పాక్ ఉలిక్కిపడింది. వెంటనే రంగంలోకి దిగిన పాక్ సైన్యం రెస్య్కూ ఆపరేషన్ ప్రారంభించింది. మిలిటెంట్లు బంధించిన పాక్ ప్రజలను విడిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ దాడికి పాల్పడింది తామేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. పాక్ సైన్యం ఇప్పటివరకు 16 మంది BLA మిలిటెంట్లను హతం చేసినట్లు తెలిసింది. బందీలుగా ఉన్న100 మందికి పైగా ప్రయాణికులను పాక్ సైన్యం రక్షించింది.
పాన్ ఇండియా డైరెక్టర్ గా మారబోతున్న స్టార్ హీరో:
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ కూడా చేసారు. కానీ ఇక్కడ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కాగా మలయాళం లో లూసిఫర్ ను తెరకెక్కించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు సిక్వెల్ గా ఎంపురాన్ -2 (Lucifer -2 )ను తెరకేక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఎల్2 ఎంపురాన్’ గ్లిమ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. మార్చి 27న “ఎల్ -2 ఎంపురాన్” ను పాన్ ఇండియా బాషలలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి అక్కడి ఇండస్ట్రీలో బిగ్ డిబేట్ జరుగుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వస్తున్న ఎంపురాన్ సూపర్బ్ గా ఉండబోతుందట. ఈ సినిమా తర్వాత పృథ్వీరాజ్ పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచుకుంటాడని మాలీవుడ్ సినీవర్గాలలో చర్చ నడుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఎంపురాన్ మాలీవుడ్ గత సినిమాల తాలూకు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న ఎంపురాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పృథ్వీరాజ్ సుకుమారన్ పాన్ ఇండియా డైరెక్టర్స్ సరసన చేరతాడని ఆశిద్దాం.
ఆ యంగ్ హీరో నెక్ట్స్ టార్గెట్ రూ. 200 కోట్లు:
ప్రదీప్ రంగనాథన్‌హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ టుడే’. హీరోగా తోలి సినిమాతోనే ప్రదీప్ రంగనాథన్ సూపర్ హిట్ కొట్టడమే కాకండా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక ఇప్పుడు తాజాగా మరొక యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 21న రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన మొదటి 10 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 150 కోట్ల మార్క్ ను టచ్ చేసేందుకు పరుగులు పెడుతుంది. ఇప్పటికీ కూడా 70 పర్సెంట్ ఆక్యుపెషన్ తో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సందడి చేస్తోంది. డైరెక్టర్ నుండి యాక్టర్ గా మారిన ప్రదీప్ రంగనాథన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోరు మీదున్నాడు. దీంతో ప్రదీప్ రంగనాథన్ నెక్ట్స్ సినిమా లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ (LIK) పై అంచనాలు పెరిగాయి. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాను నయనతార నిర్మిస్తోంది. ప్రదీప్ రంగనాథన్ కు జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. మొదటి రెండు సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలవడంతో ఇప్పుడు ప్రదీప్ నెక్ట్ టార్గెట్ రూ. 200 కోట్లగా మారిపోయింది. LIK ఏ మాత్రం హిట్ టాక్ వచ్చిన ఆ ఫీట్ సాదించడం అంత కష్టమేమి కాదు.
ఐసీయూలో పాకిస్తాన్ క్రికెట్:
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. రెండు జట్ల మధ్య 5 T20లు, 3 ODIలు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టును ఇప్పటికే ప్రకటించారు. షాదాబ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీనిపై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 జట్టులోకి ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగి రావడాన్ని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశ్నించాడు. పీసీబీ తప్పుడు నిర్ణయాల కారణంగా పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉందని అన్నాడు.
డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు ఢిల్లీ:
డబ్ల్యూపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో.. ఢిల్లీ ఫైనల్ బెర్తు దక్కించుకుంది. ఇరు జట్లు 10 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ.. ముంబై (0.192) కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న ఢిల్లీ (0.396) తుది పోరుకు అర్హత సాధించింది. ఢిల్లీకి ఇది వరుసగా మూడో ఫైనల్ కావడం విశేషం. మరోవైపు గురువారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగే ఎలిమినేటర్‌లో ముంబై తలపడనుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన టీమ్.. ఫైనల్‌లో ఢిల్లీతో తలపడనుంది.