Syria: ఒక ముస్లిం దేశం తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త కరెన్సీని రిలీజ్ చేసింది. ఇంతకీ ఆ దేశం ఏంటో తెలుసా.. సిరియా. నిజానికి ఈ దేశం చాలా కాలంగా అంతర్యుద్ధంతో సతమతమౌతుంది. మాజీ అధ్యక్షుడు అస్సాద్ పదవీచ్యుతుడైన తర్వాత, దేశంలో మార్పుల గాలులు వీచాయి. ఈ సరికొత్త మార్పుల ఫలితంగా ఈ నూతన సంవత్సరానికి సిరియాలో కొత్త నోట్లు రిలీజ్ అయ్యాయి.
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ గత సంవత్సరం పదవీచ్యుతుడయ్యారు. ఆయన స్థానంలో కొత్తగా అహ్మద్ అల్-షరా అధ్యక్షుడు అయిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన కొత్తగా రూపొందించిన దేశ కరెన్సీని ఆవిష్కరించారు. సిరియా కరెన్సీలో ఉన్న మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్, ఆయన కుటుంబ సభ్యుల చిత్రాలను ఈ కొత్త కరెన్సీలో తొలగించారు. తొలగించిన అస్సాద్, వారి కుటుంబ సభ్యుల చిత్రాల స్థానంలో గులాబీ, నారింజ పండ్లతో భర్తీ చేశారు.
సిరియా కరెన్సీ ఎందుకు మారిందంటే..
నిజానికి సిరియా చాలా సంవత్సరాలుగా అంతర్యుద్ధంతో అతలాకుతలం అయ్యింది. తాజాగా దేశంలో చోటుచేసుకున్న కరెన్సీ మార్పిడి ద్వారా సిరియాలో కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, క్రమంగా తగ్గుతున్న సిరియా కరెన్సీ విలువను స్థిరీకరించడం, అలాగే ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రస్తుత పాలకులు తెలిపారు.
దేశ మాజీ అధ్యక్షుడు అసద్ ఇమేజ్‌ను కరెన్సీ నుంచి తొలగించడం ద్వారా, దేశంలో నెలకొన్న సంఘర్షణ, అస్థిరత యుగాన్ని దాటి కొత్త, స్థిరమైన పునర్నిర్మాణ మార్గంలోకి ప్రస్తుతం సిరియా వెళుతుందనే సందేశాన్ని ప్రజలకు అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఈ నిర్ణయం కొత్త ప్రారంభానికి గుర్తుగా, పాత రాజకీయ, ఆర్థిక విధానాలకు స్వస్తి చెప్పేదిగా పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు.
సిరియా కొత్త ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి సిరియన్ పౌండ్ విలువను మెరుగుపరచడం. ఈ ప్రయత్నంలో భాగంగా ఆ దేశ నోట్ల నుంచి రెండు సున్నాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను పునఃనామకరణం అంటారని విశ్లేషకులు వివరించారు. సిరియాలో ద్రవ్యోల్బణం ఎంతగా పెరిగిందంటే, అక్కడి ప్రజల రోజువారీ కొనుగోళ్లకు కూడా వేల లేదా మిలియన్ల పౌండ్లు ఖర్చవుతాయి. దీంతో ప్రజలు కొనుగోళ్లకు పెద్ద మొత్తంలో కరెన్సీని తీసుకెళ్లవలసి వస్తుంది. ఒక రకంగా ఇది ప్రజలకు కరెన్సీపై నమ్మకం తగ్గిపోడానికి కారణం అవుతుందని, అందుకే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుందని అధికారులు వెల్లడించారు. ఉదాహరణకు ప్రస్తుతం ఒక బ్రెడ్ ముక్క ధర £10,000 అయితే, ఈ సున్నాలను తీసివేసిన తర్వాత, అదే బ్రెడ్ ముక్క ధర £100 అవుతుంది. ఇది వస్తువు వాస్తవ ధరను మార్చదని, ఇది కేవలం లెక్కలను సులభతరం చేస్తుందని వివరించారు.
సిరియా కొత్త కరెన్సీపై పాలకుడి చిత్రం ఉండదు. దానికి బదులుగా ఆ కరెన్సీపై గులాబీలు, నారింజ పండ్ల చిత్రాలు ఉంటాయి. 10 నుంచి 500 సిరియన్ పౌండ్ల వరకు ఉన్న కొత్త నోట్లు జనవరి 1 నుంచి చెలామణిలోకి వస్తాయి. 500 సిరియన్ పౌండ్లపై గోధుమలు, 25 పౌండ్లపై ఆలివ్‌లు, 100 పౌండ్లపై పత్తి, 10 పై గులాబీలు, 200 పై మామిడి పండ్లు, 50 పై నారింజలు చిత్రీకరించారు. ఈ చిత్రాల వెనుక ఉన్న ప్రత్యేక ఏమిటంటే.. సిరియా ఈ వ్యవసాయ పంటలకు ప్రసిద్ధి చెందింది.
కొత్త నోట్లను విడుదల చేసిన తర్వాత, ప్రస్తుత దేశ అధ్యక్షుడు షరా మాట్లాడుతూ.. ఈ కొత్త కరెన్సీ గుర్తుండిపోయే పాత శకానికి ముగింపు పలుకుతుందని అన్నారు. దీనిని కొత్త శకానికి నాంది అని వివరించారు. “ఇది సిరియన్లు ఎదురు చూస్తున్న కొత్త శకానికి నాంది” అని ఆయన వెల్లడించారు. కొత్త కరెన్సీ రూపకల్పన కొత్త జాతీయ గుర్తింపును సూచిస్తుందని, అలాగే వ్యక్తుల పట్ల ఉన్న భక్తి నుంచి దూరంగా జరగడాన్ని సూచిస్తుందని తెలిపారు.
The new Syrian currency strikes me as quite beautiful. It is also encouraging to see imagery that emphasizes national symbols rather than individuals, giving the notes a more timeless and universal character. #Syria pic.twitter.com/xQisiDfezc
— Gregory Galligan 🇨🇦 (@Greg_Galligan) December 29, 2025
READ ALSO: Suicidal Thoughts: ఈ నెలలోనే ‘సూసైడ్ థాట్స్’ ఎక్కువగా వస్తాయంటా!