Electric Vehicles: భవిష్యత్తులో ట్రాఫిక్ శబ్దం తగ్గనుంది. మృదువైన ఎలక్ట్రిక్ శబ్దమే ఎక్కువగా వినిపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పెట్రోల్ బంకుల స్థానంలో చార్జింగ్ స్టేషన్లు దర్శనమిస్తాయి. నగరాల్లో గాలి నాణ్యత పెరిగే అవకాశం ఉంది. ఆయిల్ మార్చడం, ఎగ్జాస్ట్ రిపేర్లు చేయడం వంటి పనులు పాతకాలపు అలవాట్లుగా మారుతాయి. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) కార్లు ఒక్కసారిగా మాయం కాకపోయినా.. వాడకం నెమ్మదిగా తగ్గిపోయి చరిత్ర పుస్తకాలలోకి వెళ్లే అవకాశం ఉంది. భవిష్యత్తు తరాలు క్లచ్ లేదా మాన్యువల్ గేర్ మార్చడం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు.
READ MORE: China vs Battle of Galwan: ‘బ్యాటల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాపై చైనా మీడియా అక్కసు..
నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు ఇప్పుడే రోడ్లపై కనిపిస్తున్నాయి. వాటిని ఇప్పుడే అధికంగా చూస్తున్నాం. కానీ.. పెట్రోల్ కార్లు ప్రాచుర్యంలోకి రావడానికి చాలా ముందే ఎలక్ట్రిక్ కార్లు వచ్చాయని ఎంత మందికి తెలుసు? నిజానికి ఎలక్ట్రిక్ కార్లు పెట్రోల్ కార్లకంటే పాతవి. 19వ శతాబ్దం ఆరంభంలోనే ఈ కార్లు ఉండేవట. 1830లలోనే యూరప్, అమెరికాలో శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు విద్యుత్‌తో నడిచే వాహనాలపై ప్రయోగాలు చేశారు. స్కాట్లాండ్‌కు చెందిన రాబర్ట్ ఆండర్సన్ 1832 నుంచి 1839 మధ్య రీచార్జ్ చేయలేని బ్యాటరీలతో ఒక ఎలక్ట్రిక్ క్యారేజీని తయారు చేశారు. అదే సమయంలో నెదర్లాండ్స్‌కు చెందిన ప్రొఫెసర్ సిబ్రాండస్ స్ట్రాటింగ్, అతని సహాయకుడు క్రిస్టోఫర్ బేకర్ చిన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేశారు. అమెరికన్ ఆవిష్కర్త థామస్ డావెన్‌పోర్ట్ చిన్న ఎలక్ట్రిఫైడ్ ట్రాక్‌పై నడిచే ఎలక్ట్రిక్ పరికరాన్ని రూపొందించారు.
READ MORE: Santhana Prapthirasthu : ఓటీటీలో దూసుకుపోతున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’..
అప్పటి ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా పరిమితులు ఉండేవి. బ్యాటరీలు బరువుగా, చాలా ఖరీదైనవిగా ఉండేవి. రీచార్జ్ చేసే అవకాశం లేకపోవడంతో దూరం, వేగం చాలా తక్కువగా ఉండేది. ఆవిరి లేదా ఇంధన దహనం లేకుండానే వాహనాలు కదలగలవని ఇవి నిరూపించాయి. అదే సమయంలో ఎలక్ట్రిక్ ట్రామ్‌లు, రైళ్ల అభివృద్ధి విద్యుత్ రవాణాపై నమ్మకాన్ని పెంచింది. 1859లో ఫ్రాన్స్‌కు చెందిన గాస్టన్ ప్లాంటే లీడ్-ఆసిడ్ బ్యాటరీని కనుగొనడంతో పరిస్థితి మారింది. ఇది వాహనాల్లో ఉపయోగించగలిగే తొలి రీచార్జ్ బ్యాటరీ. 1881లో కామిల్ ఫౌర్ చేసిన మెరుగుదలలతో బ్యాటరీ సామర్థ్యం పెరిగింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు మరింత ఉపయోగకరంగా మారాయి.
1880ల నాటికి ఎలక్ట్రిక్ కార్లు ప్రయోగాల దశను దాటి వాస్తవ వినియోగానికి వచ్చాయి. లండన్ అండర్‌గ్రౌండ్, ట్రామ్ వ్యవస్థలను విద్యుదీకరించిన థామస్ పార్కర్ 1884లో ఉపయోగపడే ఎలక్ట్రిక్ కారును నిర్మించారు. ఫ్రాన్స్‌లో గుస్తావ్ ట్రూవే 1881లో ఒక ఎలక్ట్రిక్ ట్రైసైకిల్‌ను ప్రదర్శించారు. అమెరికాలో విలియం మోరిసన్ 1890 ప్రాంతంలో ఆరు మంది ప్రయాణించగల ఎలక్ట్రిక్ వాగన్‌ను పరిచయం చేశారు. ఇది వేగంగా కాకపోయినా వాడుకకు సరిపడే స్థాయిలో ఉండడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఏ వాహన సాంకేతికత ప్రధానంగా మారుతుందో స్పష్టత లేదు. అప్పట్లో ఆవిరి, ఎలక్ట్రిక్, పెట్రోల్ వాహనాలు అన్నీ పోటీపడ్డాయి. ముఖ్యంగా నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు చాలా అనుకూలంగా ఉండేవి. 1900 నాటికి అమెరికాలో ఉన్న కార్లలో దాదాపు మూడో వంతు ఎలక్ట్రిక్ వాహనాలే. అప్పటి పెట్రోల్ కార్లు శబ్దంగా ఉండేవి, నడపడం కష్టంగా ఉండేది, తరచూ చెడిపోతుండేవి. ఆవిరి వాహనాలు శక్తివంతమైనవే కానీ నడపడానికి ముందు చాలా సమయం పడేది. దీనికి భిన్నంగా ఎలక్ట్రిక్ కార్లు శుభ్రంగా, నిశ్శబ్దంగా, నమ్మకంగా ఉండేవి. అందుకే నగరాల్లో పనిచేసే వాళ్లకు ఇవి చాలా నచ్చేవి. న్యూయార్క్, లండన్, పారిస్ వంటి నగరాల్లో ఎలక్ట్రిక్ ట్యాక్సీలు కూడా నడిచేవి. బేకర్ ఎలక్ట్రిక్, డెట్రాయిట్ ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు ధనికులను ఆకట్టుకునే కార్లను తయారు చేశాయి. థామస్ ఎడిసన్ కూడా బ్యాటరీ పరిశోధనలో పెట్టుబడి పెట్టారు. ఎలక్ట్రిక్ వాహనాలకు భవిష్యత్తు ఉందని అతను నమ్మారు.
READ MORE: Srisailam Temple: చెంచులకు శుభవార్త.. ఉచితంగా మల్లన్న స్పర్శ దర్శనం..
అయితే ఈ కార్ల సమస్యలు అంతా ఇంతా కావు. ఇందులో ఉపయోగించే లీడ్-ఆసిడ్ బ్యాటరీలు బరువుగా ఉండేవి. ఒక్కసారి చార్జ్ చేస్తే కేవలం 40 నుంచి 80 కిలోమీటర్ల దూరమే వెళ్లగలిగేవి. రోడ్లు విస్తరించడంతో, దూర ప్రయాణాలు పెరగడంతో ఈ పరిమితి పెద్ద అడ్డంకిగా మారింది. అదే సమయంలో పెట్రోల్ వాహనాల్లో వేగంగా మార్పులు వచ్చాయి. 1912లో ఎలక్ట్రిక్ స్టార్టర్ మోటార్ రావడంతో కథ పూర్తిగా మారిపోయింది. హెన్రీ ఫోర్డ్ తీసుకొచ్చిన మోడల్ T భారీ స్థాయిలో ఉత్పత్తి కావడంతో ధరలు బాగా తగ్గాయి. పెద్ద ఎత్తున చమురు లభ్యత, పెట్రోల్ బంకుల విస్తరణ పెట్రోల్ కార్లకు మరింత బలం ఇచ్చాయి. 1920ల నాటికి ఎలక్ట్రిక్ కార్లు ప్రధాన మార్కెట్ నుంచి మాయమయ్యాయి. అవి కేవలం కొన్ని పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, గోదాముల్లో మాత్రమే ఉపయోగంలో మిగిలాయి.
READ MORE: Santhana Prapthirasthu : ఓటీటీలో దూసుకుపోతున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’..
20వ శతాబ్దం అంతా ఎలక్ట్రిక్ వాహనాలు పక్కన పెట్టారు. చౌకైన పెట్రోల్, మెరుగవుతున్న ఇంజిన్ టెక్నాలజీ వల్ల వాటిని దూరం చేసుకున్నారు. కానీ శతాబ్దం చివర్లో పరిస్థితి మళ్లీ మారింది. చమురు సంక్షోభాలు, కాలుష్య భయం, కఠినమైన ఉద్గార నిబంధనలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిని మళ్లీ తీసుకొచ్చాయి. అయితే.. భారతదేశానికి కూడా ఈవీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 2001లో వచ్చిన రేవా ఎలక్ట్రిక్ కార్ నగరాల కోసం రూపొందించిన తొలి ఆధునిక ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. అప్పట్లో మౌలిక వసతులు, మార్కెట్ సిద్ధంగా లేకపోయినా ఇది ముందుచూపుతో చేసిన ప్రయత్నంగా చెబుతారు. తరువాత ఇది మహీంద్రా చేతికి వెళ్లి e2o వంటి మోడళ్లుగా అభివృద్ధి చెందింది. నేడు టాటా మోటార్స్ వంటి అనేక కంపెనీలు కార్లను రూపొందిస్తున్నాయి.