టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. తన కారులో స్వయంగా భూమనను ఎస్వీ గోశాలకు తీసుకోస్తానుని, రావడానికి భూమన సిద్దంగా ఉన్నాడా? అని ప్రశ్నించారు. అసత్య ప్రచారం నుంచి తప్పించుకోవడానికి ఇంటి దగ్గర, రోడ్డుమీద పడుకుని డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. గోవుల విషయంలో భూమన అసత్యాలు చెప్పడం దారుణం అని, హిందువులకు ఆయన క్షమాపణలు చెప్పాలని బొజ్జల డిమాండ్ చేశారు.
ఎస్వీ గోశాలకు కూటమి ఎమ్మెల్యేల బృందం ఇప్పటికే చేరుకుంది. పోలీసులు టీడీపీ కేడర్, నేతలను లోపలికి అనుమతి ఇవ్వలేదు. దాంతో టీడీపీ కేడర్, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. భూమన కరుణాకర్ రెడ్డి రాక కోసం కూటమి ఎమ్మెల్యేల బృందం ఎస్వీ గోశాల వద్ద ఎదురుచూస్తున్నారు. భూమన వస్తేనే ఎస్వీ గోశాల లోపలికి వెళుతామంటున్నారు. ప్రస్తుతం ఎస్వీ గోశాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, వైసీపీ కార్యకర్తలతో కలిసి ఎస్వీ గోశాలకు బయలుదేరిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతి ర్యాలీ పేరుతో భారీగా కార్యకర్తలతో కాకుండా.. గన్‌మెన్‌లతో గోశాలను సందర్శించవచ్చని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.