కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపిక వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపే పార్టీ హైకమాండ్ మొగ్గుచూపిందని.. ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పార్టీలో తీవ్ర సందిగ్ధత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎల్లా హోటల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కూడా ఉన్నారు. వీరితో చర్చించిన తర్వాత.. సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది.
Read Also: Mizoram Election Result 2023: మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో ZPM విజయం..
మరో వైపు రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పరిశీలకులు సమావేశం కానున్నారు. అయితే, పరిశీలకులు దగ్గర నుంచి వివరణ తీసుకున్న తర్వాతే.. సీఎం అభ్యర్థి ఎవరు అనేది కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేయనుంది. ఇక, రేపటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది తెలుస్తుంది.. మరో వైపు నేటి సాయంత్రం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా సీతక్క, భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేయనున్నారనే వార్తలతో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలక బూనారు. అయితే, తనకూ ఇప్పుడే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.