నీట్ పీజీ- 2022 పరీక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరీక్ష ఆలస్యమైతే డాక్టర్ల కొరత ఏర్పడుతుందని, తద్వారా రోగుల సంరక్షణపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. అటు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న లక్షల విద్యార్థుల జీవితాలను అయోమయంలోకి నెడుతుందని, గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని సుప్రీంకోర్టు తెలిపింది.
BrahMos: సుఖోయ్ ఫైటర్ జెట్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
నీట్ పీజీ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల్లో రెండు కేటగిరీల వారు ఉన్నారని.. ఓ వర్గం వాయిదా వేయాలని కోరుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కానీ పరీక్షను వాయిదా వేస్తే.. పరీక్ష కోసం సన్నద్ధమైన 2.06 లక్షల మంది విద్యార్థులున్న మరో వర్గానికి నష్టం జరుగుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. కరోనా కారణంగా పరీక్షల షెడ్యూల్ప్రభావితమైందని.. దానిని పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొంది. కాగా నీట్పీజీ పరీక్ష ఈ నెల 21న జరగాల్సి ఉంది. అయితే నీట్పీజీ- 2021 కౌన్సెలింగ్ ఇంకా జరుగుతుందని, అందులో సీటు దక్కని విద్యార్థులు పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వీలు కల్పించాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.