Bihar: 1995లో జరిగిన జంట హత్యల కేసుకు సంబంధించి తుది తీర్పు ఇటీవల వచ్చింది. ఇన్ని సంవత్సరాల తరువాత తీర్పు వచ్చినా బాధితులకు న్యాయం జరిగింది. ఈ కేసులో మాజీ ఎంపీకి జీవితఖైదును ఖరారు చేసింది సుప్రీం కోర్టు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. బిహార్ ప్రభుత్వం కూడా బాధితులకు ఇంతే మొత్తం చెల్లించాలని సుప్రీం ఆదేశించింది.
ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ గతంలో ట్రయల్ కోర్టు, పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పులను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసు గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్న ధర్మాసనం.. మన న్యాయవ్యవస్థలోనే ఇదో బాధాకరమైన ఘటనగా ఉండిపోతుందని వ్యాఖ్యానించింది. ఇక ఈ కేసులో విచారణ అధికారి, ప్రాసిక్యూటర్‌తో పాటు.. న్యాయవ్యవస్థ కూడా తన బాధ్యత నిర్వహణలో ఘోరంగా విఫలమైందని తెలిపింది. ప్రభునాథ్ సింగ్ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారని దానికి అధికారులు కూడా సహకరించారని, ఎవరు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదని పేర్కొంది.
Also Read: Nagapur: మానవత్వం మరచిన దంపతులు.. చిన్నారి ఒంటిపై సిగరెట్, హాట్ పాన్ తో వాతలు
వివరాల్లోకి వెళ్తే.. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎంపీ, ఆర్జేడీ నేత ప్రభునాథ్ సింగ్ బిహార్ పీపుల్స్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఈ క్రమంలోనే కారులో వచ్చిన ఆయన ఓటింగ్ రోజు చప్రాలోని పోలింగ్ స్టేషన్ నుంచి వస్తున్న కొందరు స్థానికులను ఎవరికి ఓటేశారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వేరే పార్టీకి ఓటేశామంటూ వారు చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రభునాథ్ సింగ్ వారిని గన్ తో కాల్చారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు. రాజేంద్ర రాయ్, దరోగా రాయ్ అనే వారు ఈ ఘటనలో చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడిన వారిలో ముగ్గురు కోలుకున్నారు. దీనికి సంబంధించి చప్రా పోలీస్‌స్టేషన్‌లో 1995 మార్చి 25న కేసు నమోదైంది. అంతేకాకుండా ప్రభునాథ్ సింగ్ అదే ఏడాది మరో హత్య కూడా చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించి జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. 1995లోనే జనతాదళ్ ఎమ్మెల్యే అశోక్ సింగ్ ను ఆయన సొంతింట్లో హత్య చేశాడు ఈ మాజీ ఎంపీ. ఈ హత్య కేసులో ప్రభుసింగ్ ప్రస్తుతం హజారీబాగ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.