టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు ఇటీవలి కాలంలో ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో దారుణ ప్రదర్శన చేశారు. విరాట్ ఒక్క సెంచరీ మినహా.. పేలవ ప్రదర్శన చేశాడు. రోహిత్ అయితే ఆడిన మూడు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. దాంతో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లపై విమర్శల వర్షం కురుస్తోంది. రోహిత్, కోహ్లీలు రిటైర్మెంట్ ఇవ్వాలనే డిమాండ్స్ సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల టెస్టు కెరీర్ భవితవ్యం సెలెక్టర్ల చేతిలో ఉందని సునీల్ గవాస్కర్ అన్నారు. భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ ఆటగాళ్లకు సరైన అవకాశాలు కల్పించాలని బీసీసీఐ సెలెక్షన్ కమిటీకి సూచించారు. ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత జట్టులో ఇంకా ఎంతకాలం ఉండాలనేది బీసీసీఐ సెలెక్టర్ల చేతిలో ఉంది. డబ్ల్యూటీసీ 2023-25కు భారత్ అర్హత సాధించలేదు. తప్పు ఎక్కడ జరిగిందో ఆలోచించాల్సిన సమయం ఇది. గత ఆరు నెలలో గెలవాల్సిన మ్యాచ్‌లు ఓడిపోడానికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణం. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో మన బ్యాటింగ్ ఎలా ఉందో అందరూ చూశారు’ అని సన్నీ పేర్కొన్నారు.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మకు లాస్ట్ ఛాన్స్.. పునరావృతం అయితే ఇదే చివరి ఐసీసీ టోర్నీ!
‘జూన్‌లో డబ్ల్యూటీసీ 2025-27 చక్రం కొత్తగా ఆరంభమవుతుంది. 2027 ఫైనల్‌కు ఏ ప్లేయర్స్ అందుబాటులో ఉంటారన్న విషయాన్ని బీసీసీఐ సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుని జట్టును ఎంపిక చేయాలి. రంజీ ట్రోఫీలో బాగా ఆడిన వారికి అవకాశం ఇవ్వకపోతే.. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారో లేదో ఎలా తెలుస్తుంది?. నితీశ్ రెడ్డి ప్రతిభను గుర్తించి టెస్టు జట్టుకు ఎంపిక చేసిన సెలెక్టర్లకు అభినందనలు. భారత్‌లో ప్రతిభ ఉన్న పేసర్లు ఎంతో మంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం పడకుండా చూడాలి. బుమ్రాకు మంచి పేసర్లు జతకలిస్తే.. ఏ పరిస్థితుల్లోనైనా మనం మ్యాచ్‌లను గెలుస్తాం. ఆ దిశగా సెలెక్టర్లు ఆలోచించాలి’ అని సునీల్ గవాస్కర్ సూచించారు.