బర్డ్ ఫ్లూ భయంతో సండే చికెన్ సేల్స్ కుదేలైపోయాయి. కేజీ 30 రూపాయలు తగ్గించి అమ్మినా.. కొనే దిక్కులేదు. అదే సమయంలో మటన్ 1000 రూపాయలు మార్క్ దాటేస్తే.. ఫిష్ 200 రూపాయలకు పైనే పలుకుతోంది. వైరస్ భయం మనసులో పెట్టుకుని.. చికెన్ తినడం రిస్కే అంటున్నారు జనాలు. అటు బిర్యానీ పాయింట్లు, హోటళ్లలో 40 శాతం అమ్మకాలు పడిపోయాయి. దాంతో వ్యాపారాలు లబోదిబో అంటున్నారు.
బర్డ్ ఫ్లూ భయంతో నాటు కోళ్ల కొనుగోలుకు బారులు తీరారు జనం. చికెన్ షాపులు వెలవెల పోతూ ఉంటే.. నాటుకోళ్ల అమ్మకాలు జరిపే ప్రాంతాలు మాత్రం కలకలలాడుతున్నాయి. ఇదే అదునుగా భావించిన చెన్నై వ్యాపారులు ప్రత్యేక వాహనాల్లో నాటుకోళ్లను తెచ్చి అధిక ధరలకు అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పెరిగే నాటుకోళ్ల అమ్మకాలు జోరందుకోవడంతో.. చెన్నై వ్యాపారులు దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గత వారంలో కిలో నాటుకోడి 500 రూపాయలు ధరలు పలకగా.. ప్రస్తుతం 750 రూపాయలు పలుకుతోంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రజలు మాత్రం నాటు కోళ్ల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు.
బర్డ్ ఫ్లూ మహమ్మారి పౌల్ట్రీ రంగాన్ని కుదేలు చేయడంతో.. చేపల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చేపల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం రోజుల వరకు 100 రూపాయలు కిలో పలికిన చేపలు, ప్రస్తుతం 200 నుంచి 350 పలుకుతూ ఉండడం కొనుగోలుదారులు బిక్క మొఖం వేస్తున్నారు. మాంసం ప్రియులు చేపల కొనుగోలుపై ఆసక్తి చూపుతూ ఉండడంతో.. చేపలు, రొయ్యలు, పీతలు సైతం అందుబాటులో ఉండేలా వ్యాపారులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.