ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. టెహ్రాన్ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. అమెరికా కూడా వార్నింగ్‌లు ఇస్తోంది. అణు ఒప్పందం చేసుకుంటారా, లేదా.. ఖబర్దార్ అంటూ టెహ్రాన్‌ను హెచ్చరిస్తోంది. మరో యుద్ధం ముంచుకొస్తోంది. ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్ మధ్య ఏళ్లుగా సాగుతున్న సమరం.. గాజాలో కొనసాగుతున్న అలజడి.. వీటికితోడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి.. ఇతర దేశాలు ఎంటరైతే! ప్రపంచ దేశాలన్నీ రెండుగా విడిపోయి.. సమరశంఖం పూరిస్తాయా ? మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా ?
ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక దేశంపై.. మరో దేశం దాడులకు దిగుతున్నాయి. అణుఒప్పందంపై రాజుకున్న వివాదం.. అంతకంతకూ ముదురుతోంది. అమెరికా డైరెక్ట్‌గా కాకుండా.. ఇజ్రాయెల్‌తో కలిసి ట్రెహాన్‌ను టార్గెట్ చేస్తోంది. ఇజ్రాయెల్ యుద్ధకాంక్షకు అమెరికా ఆజ్యం పోస్తుంటే.. ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి ? అమెరికాకు ఐరోపా దేశాలు వంత పాడుతాయా ? ఇరాన్‌కు ముస్లిందేశాలు
అండగా నిలుస్తాయా ?
ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక దేశంపై.. మరో దేశం దాడులకు దిగుతున్నాయి. అణుఒప్పందంపై రాజుకున్న వివాదం.. అంతకంతకూ ముదురుతోంది. అమెరికా డైరెక్ట్‌గా కాకుండా.. ఇజ్రాయెల్‌తో కలిసి ట్రెహాన్‌ను టార్గెట్ చేస్తోంది. ఇజ్రాయెల్ యుద్ధకాంక్షకు అమెరికా ఆజ్యం పోస్తుంటే.. ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి ? అమెరికాకు ఐరోపా దేశాలు వంత పాడుతాయా ? ఇరాన్‌కు ముస్లిందేశాలు అండగా నిలుస్తాయా ?
ఇజ్రాయెల్- ఇరాన్‌ల మధ్య దాడులు తీవ్రమయ్యాయి. పరస్పర దాడులతో ఇరుదేశాలు విరుచుకుపడుతున్నాయి. టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయగా.. టెల్‌అవీవ్‌పై ఇరాన్ మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పరస్పరం వైమానిక దాడులు.. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
అమెరికా అండదండలతో.. ఇరాన్‌పై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. తొలుత అణు కర్మాగారాలే లక్ష్యంగా విరుచుకుపడింది. పలు విడతల్లో ఇరాన్‌వ్యాప్తంగా 200కు పైగా అణు, సైనిక లక్ష్యాలపై క్షిపణులు, బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్.. పక్కా స్కెచ్‌తో ఇరాన్‌ను టార్గెట్ చేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ కోసం చాలాకాలం నుంచే పక్కాగా ప్లాన్ చేసింది ఇజ్రాయెల్. ఆయుధాలు, కమాండోలు, డ్రోన్లను రహస్య మార్గాల్లో ఇరాన్‌లోకి చేరవేసింది. ఇందులో మొస్సాద్ కీలకపాత్ర పోషించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు అత్యంత సమీపంలోనే డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలుకాగానే ఇక్కడి నుంచి డ్రోన్లను ప్రయోగించి…ఇరాన్ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసింది. గగనతల రక్షణ వ్యవస్థలనూ నాశనం చేసింది. మధ్య ఇరాన్‌లోని విమాన విధ్వంసక కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ కమాండోలు అత్యంత కచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను మోహరించి దాడులు చేశారు. ఆ తర్వాత యుద్ధ విమానాలు, క్షిపణులతో ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలు, మిలటరీ కార్యకలాపాల ప్రధాన కేంద్రాలపై టెల్ అవీవ్ విరుచుకుపడింది. మొత్తం ఐదు దశల్లో దాడులు చేసింది ఇజ్రాయెల్.
ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం కావడంతోనే ఆ దేశ అణు శుద్ధి కేంద్రాలపై నిరాటంకంగా ఇజ్రాయెల్ జెట్లు పలుమార్లు దాడులు చేసాయి. పదేపదే భారీ క్షిపణులు, బాంబులతో చేసిన దాడుల్లో నతాంజ్‌లోని మెయిన్ అణుశుధ్ధి కర్మాగారం భుగ్గిపాలైంది. తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలతో పాటు ఆర్మీ చీఫ్ కూడా హతమయ్యాడంటే.. ఇజ్రాయెల్ ప్లానింగ్ ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. గాజాపై ఏడాదిన్నరకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఇరాన్‌పైనా ఇజ్రాయెల్ అటాక్ చేస్తోంది. టెల్ అవీవ్‌పై దాడి చేసి మారణహోమం సృష్టించిన హమాస్‌ను చావు దెబ్బ కొడుతున్న ఇజ్రాయెల్.. అందుకు సూత్రధారులైన ఇరాన్‌ను కూడా మట్టుబెట్టేందుకు సిద్ధమైంది. లెబనాన్, పాలస్తీనాలోని ఉగ్రవాదులకు సైనిక, ఆర్థికపరంగా అండదండలు అందిస్తున్న ఇరాన్‌ను టార్గెట్ చేయడానికి.. చాలాకాలంగా నెతన్యాహు ఎదురుచూస్తున్నారు. అందుకే అమెరికా ఆచితూచి అడుగు వేయాలని కోరుతున్నా.. నెతన్యాహు మాత్రం తగ్గడంలేదు. ఇరాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఎప్పటికైనా.. తమకు డేంజరే అని.. వాటిని పూర్తిగా తుడిచిపెట్టేవరకు దాడులు ఆపేది లేదంటున్నారు నెతన్యాహు. తమ మనుగడకు ఇరాన్ ముప్పన్న అభిప్రాయం ఇజ్రాయెలీలందరిలోనూ ఉంది.
ఇజ్రాయెల్ దాడిలో టెహ్రాన్ పలు కీలకమైన మిలిటరీ అధికారులను, అణుశాస్ర్తవేత్తలను కోల్పోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగాయి. టెహ్రాన్‌లోని మోనిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది. ఇరాన్ కొత్త మిలిటరీ చీఫ్‌గా అమీర్ హతామీని నియమించారు ఖమేనీ. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతిచెందారు. దీంతో ఆయన ప్లేసులో.. గతంలో రక్షణమంత్రిగా పనిచేసిన హతామీని.. మిలిటరీ చీఫ్‌గా నియమించారు.
తమపై దాడిని యుద్ధంగా అభివర్ణించింది ఇరాన్. అందుకు తగిన బదులిస్తామని హెచ్చరించింది. దానికి తగ్గట్టుగానే కౌంటర్ అటాక్‌కు దిగుతోంది. ఇజ్రాయెల్ దాడులకు తీవ్రమైన శిక్ష విధిస్తామని ఖమేనీ హెచ్చరించారు. దాడుల అనంతరం అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వెంటనే 100 డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడులు చేశారు. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తన వైమానిక స్థావరాలను, గగన తలాన్ని మూసివేసింది. పక్క దేశం ఇరాక్ కూడా గగనతలాన్ని మూసేసింది. అన్ని విమానాశ్రయాలలో విమాన రాకపోకలను నిలిపివేసింది. ఆ తర్వాత.. ఇజ్రాయెల్‌పై మిస్సైళ్లతో విరుచుకుపడింది టెహ్రాన్. టెల్‌అవీవ్ పౌరుల నివాసాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ కౌంటర్ అటాక్‌లో కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు IDF కూడా ధ్రువీకరించింది. ఇరాన్ తమ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తే సహించేది లేదని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థల్లో కీలకమైన ఐరన్ డోమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థుల నుంచి దూసుకొస్తున్న మిస్సైళ్లను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ దీన్ని ఉపయోగిస్తోంది. అయితే టెహ్రాన్ చేసిన మిస్సైల్ దాడులను ఈ ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయింది. దీంతో ఆ మిస్సైల్ టెల్‌అవీవ్ లోపలికి దూసుకు రాగా.. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పేలుళ్లు సంభవించాయి. ఇంతకముందు కూడా హమాస్.. వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించి ఐరన్‌డోమ్ నుంచి తప్పించుకొని దాడులు చేసింది. ఒకేసారి భారీగా రాకెట్లు, మిసైల్స్ దూసుకొస్తే.. ఐరన్‌డోమ్‌కు కూడా వాటిని అడ్డుకోవడం అంత ఈజీ కాదు. అదే ఫార్ములాను ఇప్పుడు ఇరాన్ కూడా ప్రయోగిస్తోంది.
ఒకవైపు ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ ఇప్పటికైనా తమతో అణు ఒప్పందాలపై చర్చలకు రావాలన్నారు. లేదంటే ఇంకా దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్.. టెహ్రాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు వేస్ట్ అని చెప్పింది. తమపై దాడికి అగ్రరాజ్యం ఇజ్రాయెల్‌కు మద్దతు పలికిందని విమర్శించింది. అమెరికా ఒకవైపు ఇరాన్‌పై దాడులకు మద్దతునిస్తూ..మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరైన చర్య కాదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ చెప్పింది. అగ్రరాజ్యం అనుమతి లేకుండా అసలు ఇజ్రాయెల్ తమపై దాడి చేసే అవకాశమే లేదంటోంది. ఇరాన్, అమెరికా మధ్య అణుఒప్పందం కోసం ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య 5 సార్లు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఆరోసారి చర్చలు జరగాల్సి ఉంది. గత కొద్దిరోజులుగా.. ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. తమతో అణుఒప్పందం చేసుకోకపోతే.. ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమవుతాయని స్పష్టంచేశారు. పరిస్థితి చేయి దాటకముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసన్నారు ట్రంప్. ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సైన్యంలోని సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్‌ను కూడా కాపాడేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. ఇతరదేశాలకు పాకుతుందా ? అమెరికా, యూకే, ఫ్రాన్స్‌లకు.. ఇరాన్ వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి ? ఇరాన్‌కు ఏయే దేశాలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది ? ఇంతకీ ఇరాన్ అణు కార్యక్రమం.. ఇంత వివాదాస్పదం ఎందుకైంది ? తొమ్మిదేళ్ల క్రితం ఒప్పందం నుంచి బయటకు వచ్చిన అమెరికా.. ఇప్పుడు ఎందుకు ఆ అగ్రిమెంట్ కోసం పట్టుబడుతోంది ?
ఆదివారం ఇరాన్ అణు కార్యక్రమంపై ఆరోసారి చర్చలు జరగాలి. ఈ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించేలా చేసేందుకు అమెరికా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. టెహ్రాన్‌కు అనేక విధాలుగా వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం.. చర్చలకంటే ముందే అటాక్ ప్రారంభించింది. ఇన్నిరోజులుగా చెబుతున్నట్టే.. అన్నంత పని చేశారు నెతన్యాహు. అసలు ఈ రెండు దేశాల మధ్య ఎందుకింత శత్రుత్వం?..స్మాల్ స్పాట్
1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఇరాన్ ప్రధాన శత్రువులుగా గుర్తించింది. అప్పటి నుంచి వీళ్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. టెహ్రాన్ అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తోందని ఇజ్రాయెల్ గత 20 ఏళ్లుగా ఆరోపిస్తూనే ఉంది. అయితే శాంతియుత ప్రయోజనాల కోసమే అణు కార్యక్రమం చేపడుతున్నట్లు ఇరాన్ చెప్పుకొస్తోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ.. ఇరాన్ దగ్గర అణ్వాయుధాల ఉత్పత్తికి తగినంత యురేనియం నిల్వలు ఉన్నట్లు గతంలోనే హెచ్చరించింది. 2003 వరకు ఇరాన్.. వ్యవస్థీకృత అణ్వాయుధ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఐఏఈఏ చెబుతోంది. ఇరాన్ మాత్రం.. అలాంటిదేమీ లేదని చెబుతూనే.. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం నిల్వలను అభివృద్ధి చేసుకుంటోంది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికాను ఎదుర్కోవాలంటే.. అణ్వాయుధాలు ఉండాల్సిందే అని ఇరాన్ భావించింది. అందుకోసమే వాటిని సమకూర్చుకుంటోంది. 2018లో ఇరాన్ అణు రహస్యాల గుట్టు.. మొస్సాద్‌కు తెలిసింది. టెహ్రాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదను మొస్సాద్ హత్య చేసింది.
అసలు ఇప్పుడు అణు ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకోవాలని ఇంత రాద్ధాంతం చేస్తున్న అమెరికా.. బరాక్ ఒబామా హయాంలో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం నుంచి 2018లో బయటకు వచ్చేసారు ట్రంప్. అప్పట్లో ఒబామా ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందం ఇరాన్‌ను మిగతా ప్రపంచానికి జవాబుదారీని చేసి, పరిధుల్లోనూ, పర్యవేక్షణలోనూ ఉంచింది. అప్పటివరకూ యుద్ధభయంతో ఉన్న ప్రపంచానికి ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. యుద్ధం తప్ప శాంతి గిట్టని, ఒప్పందాల మాటే నచ్చని నెతన్యాహూ మాత్రం ఆదినుంచీ దానిని వ్యతిరేకిస్తూ ట్రంప్ అధికారంలోకి రాగానే సదరు ఒప్పందాన్ని కాలదన్నేట్టు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒప్పందం పేరిట ఒక కొత్త కథకు ట్రంప్ తెరదీసినా, ఇరువురి అంతిమలక్ష్యం ఇరాన్‌ను కంట్రోల్ చేయడమే. ఇరాన్ తన యురేనియం శుద్ధికార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసి, ఇప్పటికే తన దగ్గరున్న 400కేజీల యురేనియంను నాశనం చేయాలని ట్రంప్ ఒత్తిడిచేస్తున్నారు.
ఇజ్రాయెల్ సంగతి తెలిసిన ఇరాన్.. మొదటి నుంచి అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఉగ్రవాద అనుబంధ గ్రూప్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన ఇరాన్ వాటిని.. ఇజ్రాయెల్‌పైకి ఉసిగొల్పుతోంది. గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్‌బొల్లా, యెమెన్‌లో హూతీలు, ఇరాక్, సిరియాలో మిలిషియా సంస్థలకు ఇరాన్ అండదండలు ఉన్నాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత..యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ క్రమంగా బలహీనపడటం మొదలైంది. హమాస్ ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి.. వారి స్థావరాలను నేలమట్టం చేసింది. సొరంగాలను సైతం వదల్లేదు. వారికి మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్‌బొల్లా దాడులకు పాల్పడగా.. వారి మౌలిక వసతులను సైతం ఇజ్రాయెల్ దెబ్బతీసింది. ఈ తరహా చర్యలతో ఉగ్రనెట్‌వర్క్ బలహీన పడింది.
ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని ఎప్పుడో గ్రహించిన ఇజ్రాయెల్.. అనువైన సమయం కోసం వేచి చూసింది. ఓ వైపు ఉగ్రనెట్‌వర్క్ బలహీనపడటం, మరోవైపు అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికా చేస్తున్న ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించడం.. ఇజ్రాయెల్‌కు బాగా కలిసి వచ్చాయి. ఈ సమయంలో దాడి చేస్తే, అమెరికా నుంచి ఇరాన్‌కు మద్దతు ఉండదు. టెహ్రాన్ భారీ మొత్తంలో యురేనియం నిల్వలను సమకూర్చుకోవడం ఇజ్రాయెల్‌ను ఒకింత భయాన్ని కలిగించింది. అణ్వాయుధాలను ఉత్పత్తి చేసి.. తమ దేశంపై ప్రయోగిస్తుందన్న భయంతో ముందుగానే ఆయా కేంద్రాలను నేల మట్టం చేయాలని నిర్ణయించి.. దాడులకు దిగింది.
సైనికపరంగా ఇరాన్, ఇజ్రాయెల్‌లు శక్తిమంతమైన దేశాలే. అయితే 1979 నుంచి వివిధ రూపాల్లో ఆంక్షలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ దేశం వద్ద ఉన్న సంప్రదాయ ఆయుధాల్లో చాలావరకు కాలం చెల్లినవే. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు అమెరికా, సోవియట్ యూనియన్ అందించినవి. ఇటీవల రష్యా నుంచి వచ్చినవి ఇరాన్ వద్ద ఉన్నాయి. వీటితోపాటు ఆ దేశ వైమానిక దళంలో సుమారు 350 పాత యుద్ధ విమానాలున్నాయి. సాయుధ డ్రోన్లకు సంబంధించి ఇరాన్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. ఇజ్రాయెల్ వద్ద అధునాతన ఆయుధ సంపత్తి ఉంది. 2024 అక్టోబర్‌లో ఇరాన్ భారీగా చేపట్టిన క్షిపణి దాడి.. ఇజ్రాయెల్‌కు పరిమిత నష్టం మాత్రమే కలిగించింది.
8.8కోట్ల జనాభా ఉన్న ఇరాన్‌కు.. భారీగా సైనిక బలగం కూడా ఉంది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ చర్యల వల్ల ఇరాన్ సైనిక అనుబంధ సంస్థలు ఇటీవల తీవ్రంగా బలహీనపడ్డాయి. ఇరాన్ సైన్యం రెండు భాగాలుగా ఉంటుంది. సాధారణ సైన్యంలో సరిహద్దు భద్రత, యుద్ధ సమయంలో రంగంలోకి దిగుతుంది. దాదాపు 6 లక్షల మంది సైనిక బలగాలతో సిద్ధంగా ఉంటుంది. రివల్యూషనరీ గార్డ్స్ సుమారు 2 లక్షల మందితో వ్యూహాత్మకంగా ఉంటుంది. అటు ఇజ్రాయెల్.. జనాభా, భూభాగం పరంగా.. ఇరాన్‌తో పోలిస్తే చాలా తక్కువ. కేవలం 90 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్.. సైనికపరంగా పటిష్ఠమైంది. దేశీయంగా తయారు చేసుకున్న అత్యాధునిక ఆయుధాలతో పాటు… అమెరికా, ఐరోపా టెక్నాలజీ వారికి అండగా ఉంది. చిన్న దేశమైనప్పటికీ, 1.7లక్షల మంది క్రియాశీల సైనికులు, 4 లక్షల మంది రిజర్వు బలగాలు.. ఇజ్రాయెల్‌కు ఉన్నాయి.
ఇరాన్ కొన్ని సంవత్సరాలుగా అణ్వస్త్రాలను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు, ఒకటి కంటే ఎక్కువ అణ్వాయుధాలు తయారు చేయగలిగే స్థాయిలో యురేనియం సంపాదించిందన్నది నిపుణుల అంచనా! అయితే అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయా, లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అణ్వస్త్రాలను ఇరాన్ సమకూర్చుకునేలోపే.. కట్టడి చేయాలన్నది అమెరికా వ్యూహం. అందుకే… అణ్వస్త్ర కార్యక్రమాలపై ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉండొచ్చనే అనుమానం ఉంది. అయితే తన వద్ద అణ్వస్త్రాలు ఉన్నట్లు ఇజ్రాయెల్ ఎన్నడూ అధికారికంగా వెల్లడించలేదు.
ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ఆ వార్‌కు కారణం.. అమెరికా, ఐరోపా దేశాలని అందరికీ తెలుసు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకుంటామని.. రష్యాను రెచ్చగొట్టి.. యుద్ధానికి దిగేలా చేసింది అమెరికా. తన సమీప దేశాలన్నింటినీ నాటోలో చేర్చుకుంటూ.. రష్యాను టార్గెట్ చేస్తున్న అమెరికా, ఐరోపా దేశాలకు చెక్ పెట్టేందుకు.. యుద్ధం కొనసాగుతూనే ఉంది. జెలెన్స్‌కీకి ఆయుధాలను అందిస్తూ.. రష్యాపై పోరాడేలా చేస్తున్నాయి.. ఐరోపా, అమెరికా. రష్యాకు చైనా, ఉత్తర కొరియాతో పాటు ఇరాన్ కూడా అండగా నిలుస్తోంది. దాంతోపాటు చిరకాల శత్రువు అయిన ఇరాక్‌తో కూడా ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంది. చైనా ప్రోద్బలంతో.. ఇదంతా జరగడం.. అమెరికాకు ఇష్టంలేదు. మిడిల్‌ఈస్ట్‌లో తమ ప్రాబల్యం తగ్గడం నచ్చని అమెరికా.. ఇరాన్‌ను టార్గెట్ చేస్తోంది. అందుకే గతంలో ఏకపక్షంగా అణుఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా.. ఇప్పుడు మళ్లీ అదే అగ్రిమెంట్‌కు రావాలని యుద్ధానికి సై అంటోంది.
ఇజ్రాయెల్, అమెరికాను స్వయంగా ఎదుర్కోవడం.. ఇరాన్ ఒక్కటి వల్ల కాదు. అయితే ఇరాన్‌కు ముస్లిందేశాల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా టర్కీ,అజర్‌బైజాన్, పశ్చిమాసియాలో పొరుగు దేశాలు.. ఇరాన్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. చైనా, రష్యా కూడా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సపోర్ట్ చేయొచ్చు. ఉత్తర కొరియా కూడా ఇరాన్‌కు మద్దతుగా ఉంది. అమెరికా ఏకపక్షంగా ఇరాన్‌పై యుద్ధానికి దిగితే.. రష్యా, ఉత్తర కొరియా సహా అనేక దేశాలు టెహ్రాన్‌కు సపోర్ట్ చేయొచ్చు. అప్పుడు ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం.. ఇతర దేశాలు ఎంట్రీ ఇవ్వొచ్చు.