PM Modi: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని, రాష్ట్రాలు మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు త్వరితగతిన విచారణ జరిపి శిక్షించాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. ఇటీవల కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Rahul Gandhi: పదేళ్ల తర్వాత తొలిసారి.. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ప్రతిపక్ష నేత
“…ఈరోజు ఎర్రకోట నుండి నా బాధను మరోసారి చెప్పాలనుకుంటున్నాను. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మనం తీవ్రంగా ఆలోచించాలి – దీనికి వ్యతిరేకంగా దేశంలో ఆగ్రహం ఉంది. ఈ ఆగ్రహాన్ని దేశం, సమాజం, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలి.” అని ప్రధాని మోడీ అన్నారు.దేశంలో ఎక్కడైనా అత్యాచార ఘటనలు జరిగితే మీడియా హైలైట్ చేస్తోందని ప్రధాని చెప్పారు. దోషులను కఠినంగా శిక్షిస్తే అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడిన సందర్భాలకు ప్రచారం జరిగితే నేరస్తుల్లో భయం పుడుతుందన్నారు. దేశంలో అత్యాచార ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రధాని మోడీ.