AP Election Results 2024: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నాలుగంచెల భద్రత చేపట్టాం.. అల్లర్లకు పాల్పడేవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాము అని హెచ్చరించారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. జిల్లా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత చేపట్టామని పేర్కొన్నారు. రెండు కౌంటింగ్ సెంటర్లలో 1500 మందితో పాటు 500 మందికి జిల్లావ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. జిల్లావ్యాప్తంగా 101 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పికెట్ ఏర్పాటు చేశామన్నారు. 30 మందిని జిల్లా బహిష్కరణ చేశామని.. 1500 మందిని బైండోవర్ చేశామన్నారు. సమస్యాత్మక పట్టణాల్లో డ్రోన్ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టామని తెలియజేశారు. అల్లర్లకు పాల్పడేవారు ఎంతటి వారైనా తాట తీస్తామని హెచ్చరించారు.
Read Also: Heavy Rains: అనంతపురం జిల్లాలో భారీ వర్షం.. రాయదుర్గం-బళ్లారి రాకపోకలకు బ్రేక్..
ఇక, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎస్పీ స్థాయి అధికారులతో పర్యవేక్షణ కలిగి ఉంటుందని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లతో పాటు సమస్యలను సృష్టించే వారిని మొత్తం 1500 మందినీ బైండోవర్ చేసి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి శాంతి భద్రతల గురించి వివరించామని.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ గొడవలు సృష్టించాలనుకున్న వాటిని అణచివేసేందుకు పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. గొడవలు జరగక ముందే వాటిని అరికట్టేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి.