Heavy Rains: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వేదవతి హగరి, వాగులు వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. డి.హీరేహాల్ మండలం చెర్లోపల్లి వద్ద బొమ్మనహల్ సెక్షన్ పరిధిలోని హెచ్‌ఎల్సీ కాల్వకు భారీగా వరద వచ్చింది. చెర్లోపల్లి వద్ద హెచ్‌ఎల్సీ అండర్ టన్నెల్ ఛానల్‌కు రంధ్రం పడి వంకలోకి వరద నీరు వృథాగా వెళుతున్నాయి. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ మొక్కజొన్న, పత్తి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
బొమ్మనహల్ హెచ్.ఎల్.సి సెక్షన్ పరిధిలోని డి హీరేహాల్ మండలం చెర్లోపల్లి వద్ద గల తుంగభద్ర ఎగువ కాలువకు ( హెచ్ ఎల్ సి) అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రధాన కాలువలో వరద నీటికి 119-400 కిలోమీటరు వద్ద (ut) అండర్ టెన్నల్ ఛానల్ కు రంధ్రం పడి దెబ్బతిని వరద నీరు వంకలోకి వృధాగా వెళుతున్నాయి. బొమ్మనహల్ మండలంలో 91.0 మీ. మీ వర్షపాతం నమోదయింది. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి డి.హీరేహాల్ మండలం సొములాపురం గ్రామం వద్ద భారీ గా ప్రవహిస్తున్న చిన్న హగరి.. దీంతో రాయదుర్గం, బళ్లారి రాకపోకలు అంతరాయం ఏర్పడింది.. కనేకల్ మండలంలో భారీ వర్షానికి వేదవతి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో, కనేకల్, ఉరవకొండ నడుమ బస్సుల రాకపోకలు నిలిచాయి. వేదావతి హగరికి జలకళ సంతరించుకుంది. రైతులు బోరుబావుల కింద వేసుకున్న మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. వరదనీటిలో కొట్టుకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇక, నైరుతి రుతుపవనాల ప్రభావంతో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా, గత అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల వరకు ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో వాగులు వంకలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించాయి. బనగానపల్లె మండలంలోని తిమ్మాపురం సమీపంలోగల పచ్చర్ల వాగు, కోవెలకుంట్ల మండలం వల్లంపాడు వద్ద ఉన్న నల్ల వాగు, భారీగా వరద నీటితో ప్రవహించాయి. భారీ వర్షం కురియడంతో నంద్యాల – బనగానపల్లె మార్గంలో ప్రయాణించే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, పచ్చర్ల వాగు ఉదృతంగా ప్రవహిస్తు ఉండటం తో వాహనదారులు తమ వాహనాలను రోడ్డు మీదనే నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులు, డిపోలకు వెను తిరిగి వెళ్ళిపోయాయి,దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత మూడు నెలలుగా సుమారు 45 డిగ్రీలకు పైగా నమోదై ఉన్న ఎండ వేడిమి, ఉక్కపోత తో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలకు, భారీ వర్షం కురియడంతో ఉపశమనం లభించినట్లయ్యింది, ఖరీఫ్ సీజన్ ఆరంభం లోనే, నైరుతి రుతుపవనాలు వచ్చి వర్షాలు ప్రారంభం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.