South Korea: నిత్యం సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలవడం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అలవాటు అయ్యింది. ఇటీవల ఆయన ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా అగ్రరాజ్యం ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే.. దక్షిణ కొరియాకు అందరికీ వింతగా అనిపించే ఒప్పందాన్ని ఆఫర్ చేసింది కాబట్టి. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దేశంపై ఏకపక్ష సుంకాలను విధించారు. తాజాగా ఆయన ఆ సుంకాలను తగ్గించడానికి దక్షిణ కొరియాకు వింతగా అనిపించే ఒప్పందాన్ని ప్రతిపాదించారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న వివాదాన్ని మరింత తీవ్రతరం చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Karur Stampede : గుండె వణికిపోయింది.. తొక్కిసలాటపై రజినీకాంత్, కమల్ హాసన్ రియాక్ట్
ట్రంప్ ఆఫర్‌తో ఆర్థిక వ్యవస్థ నాశనం..
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల తగ్గింపు విషయంలో భాగంగా దక్షిణ కొరియా నుంచి $350 బిలియన్ల నగదు చెల్లింపును డిమాండ్ చేశారు. అయితే దక్షిణ కొరియా దీనిని అసాధ్యమని పేర్కొంది. ఇంత పెద్ద మొత్తంలో నగదు చెల్లించడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని వెల్లడించింది. సుంకాల తగ్గింపులపై జూలైలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ఇప్పుడు ప్రమాదంలో పడినట్లు తెలుస్తుంది. ట్రంప్ కొత్త షరతు ఉద్రిక్తతలను పెంచుతుందని విశ్లేషకులు అంటున్నారు. జూలైలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల సందర్భంగా దక్షిణ కొరియా వస్తువులపై సుంకాలను 25% నుంచి 15%కి తగ్గించడానికి అమెరికా అంగీకరించింది. ప్రతిగా సియోల్ – యూఎస్ ప్రాజెక్టులలో $350 బిలియన్లను పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చింది. ఈ మొత్తాన్ని రుణాలు, హామీలు, ఈక్విటీ ద్వారా అందించాలి. అయితే, ట్రంప్ ఇప్పుడు ఈ డబ్బును నగదు రూపంలో డిమాండ్ చేస్తున్నారు.
నగదు చెల్లింపు అసాధ్యమం..
దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు వై సుంగ్-లాక్ యూఎస్ ఆఫర్ చేసిన $350 బిలియన్ల నగదు చెల్లింపు అసాధ్యమం అని పేర్కొన్నారు. ఇంత పెద్ద నగదు చెల్లింపు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ కూడా హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. దక్షిణ కొరియా వద్ద దాదాపు $410 బిలియన్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. అయితే ఒకేసారి వాటన్నింటిని చెల్లింపు ప్రక్రియ అనేది దేశానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని చెబుతున్నారు. ఒప్పందం కొనసాగాలంటే కరెన్సీ మార్పిడులు వంటి రక్షణ చర్యలు అవసరమని లీ సూచించారు.
APEC శిఖరాగ్ర సమావేశంపై ఆశలు..
ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం చర్చలు నిలిచిపోయాయి. ఈ రెండు దేశాల మధ్య చర్చలకు అతిపెద్ద అడ్డంకి ఏమిటంటే.. అగ్రరాజ్యం నిధులపై ప్రత్యక్ష నియంత్రణ కోరుతుండగా, దక్షిణ కొరియా దీనిని వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే నెలలో సియోల్‌లో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) శిఖరాగ్ర సమావేశంపై ఉంది. ఈ సమావేశానికి డోనాల్డ్ ట్రంప్ హాజరవుతారు. ఈ వేదికపై రెండు దేశాల మధ్య ఈ సమస్యకు పరిష్కారం కుదరవచ్చని కొరియా నాయకత్వం భావిస్తోంది. ప్రస్తుతం వాళ్ల ఆశలన్నీ ఈ శిఖరాగ్రసమావేశంపైనే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Argentina Protests: అర్జెంటీనాలో ప్రజాగ్రహం.. దేశాన్ని కమ్మేసిన నిరసనలు..