కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ (Soniya Gandhi) రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ (Rajasthan) నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆమె జైపూర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. సోనియా వెంట రాహుల్‌గాంధీ (Rahul Gandhi), ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi), మాజీ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ ఉన్నారు.
రాజస్థాన్‌లో 10 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోని మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో తమ బలాబలాల ప్రాతిపదికన అధికార బీజేపీకి రెండు, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఒక సీటు దక్కనుంది. బీజేపీ అభ్యర్థులుగా మాజీ మంత్రి చున్నిలాల్ గరాసియా, మాజీ ఎమ్మెల్యే మదన్ రాథోడ్‌లను ఎంపిక చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో 200 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 115, కాంగ్రెస్‌కు 70 సీట్లు ఉన్నాయి. పోటీ జరిగినప్పుడు ఒక రాజ్యసభ సీటును గెలుచుకోవడానికి కనీసం 67 ఓట్లు అవసరం.
సోనియా ప్రస్థానం
సోనియా.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. 1998-2022 మధ్య దాదాపు 22 సంవత్సరాలు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే రాయ్‌బరేలీ నుంచి ఈసారి ప్రయాంకాగాంధీ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. అయితే ఈసారి ఆ స్థానం నుంచి సోనియా తప్పుకోవడం వల్ల ప్రియాంకకు లైన్‌క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కంచుకోటలాంటిది. దీంతో ప్రియాంక ఇక్కడ ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది.