Somu Veerraju : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు సోము వీర్రాజు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రజా పాలన సాగుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఉచిత గ్యాస్ పధకం కూడా అమల్లోకి తీసుకు వచ్చారని, అంచలు అంచలుగా ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తారన్నారు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు చేశారని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ.. ముందుకు వెళుతున్నారన్నారు. ఆర్ధిక పరిస్థితి మెరుగు పరచుకుంటూ… ఉద్యోగులకు ఒకటో తేదీనే ఇస్తున్నారని, కూటమి పాలనపై సందేహాలు వ్యక్తం చేయాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు సోము వీర్రాజు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లిస్తూ.. అభివృద్ది కూడా చేస్తున్నారని, మరోవైపు సంక్షేమ పధకాల ద్వారా పేదలను ఆదుకుంటున్నారన్నారు సోము వీర్రాజు.
Trump Victory Speech: అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు..
అంతేకాకుండా..’ఎటువంటి అభివృద్ది లేకుండా గత ఐదేళ్లల్లో పూర్తిగా వదిలేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్దికి సమాన ప్రాధాన్యత ఇస్తుంది. అనేక కొత్త పాలసీలను అమలు చేస్తూ.. పరిశ్రమలను తీసుకు వచ్చే విషయంలో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ని సమగ్రాభివృద్ది దిశగా తీసుకు వెళ్లేలా ప్రభుత్వం పని చేస్తుంది. ఈ అంశాలపై వైసీపీ నేతలు అధ్యయనం చేసి మాట్లాడితే బాగుంటుంది. నేడు డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఎపీ అన్ని విధాలా అబివృద్ది చెందుతుంది. అనేక ఆలోచనలతో ముందుకు సాగుతున్న తీరుపై మనసుతో వైసీపీ నేతలు ఆలోచించాలి. నేడు అమరావతి అభివృద్ది, పరిశ్రమల పై పాలసీ, పోలవరం వంటి అంశాలపై వారు ఎందుకు ఆలోచన చేయడం లేదు. కేవలం ఒకే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం పని చేయడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఎన్నికలలో ఇచ్చిన అన్ని అంశాలను అమలు చేస్తాం. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమన్వయంతో పని చేసి అభివృద్దిలో భాగస్వామ్యం అవుతున్నారు. నిత్యావసర వస్తువులను తగ్గించి ఇచ్చేలా పౌరసరఫరాలశాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ తన శాఖల పట్ల సమీక్షలు, పని తీరు చూస్తున్నాం. ఇలా ఎవరికి వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. అయినా వైసీపీ మాత్రం ఏకపక్షంగా విమర్శలు చేయడం మంచి విధానం కాదు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఘోరంగా విఫలమయ్యారు. కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు జరిగినా.. ఇప్పటి వరకు ఆయన స్పందించక పోవడం ఆయన నైజాన్ని తెలియ చేస్తుంది. గాజా ఘటనపై మాత్రం వెంటనే స్పందించిన తీరు సెక్యూలరిజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అర్దం అవుతుంది. ప్రతిపక్ష నేతగా భిన్న వర్గాలు, భిన్న మతాలను సమానంగా చూడాలి. ఆయన వైఖరితో అసలు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత రాహుల్ గాంధీకి ఉందా. గాజాలో ఎలా అయితే స్పందించారో.. కెనడాలో హిందువులపై జరిగిన దాడులను ఖండించాలి. బీజేపీని వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి కూడా ఈ అంశాలను ప్రస్తావించకపోవడం చూస్తే.. మత రాజకీయాలను వారు ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది’ అని సోము వీర్రాజు అన్నారు.