ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి లోక్‌సభ స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.. ఇక్కడి నుంచి ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం కొనసాగుతుంది. దీనిపై బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ స్పందించింది. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె రాహుల్ గాంధీపై విమర్శలు కురిపించింది. పోలింగ్‌కు ఇంకా 27 రోజులే సమయం ఉంది.. కానీ, కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించకలేదని ఎద్దేవా చేసింది. ఈ స్థానంపై రాహుల్ గాంధీ బావ (రాబర్ట్ వాద్రా) కన్నేశాడు.. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో? చూడాలని తెలిపింది. ఒకప్పుడు ప్రజలు బస్సుల్లో వెళ్లే సమయంలో సీట్ల కోసం కర్చీఫ్ వేసుకునేవారు.. కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అమేథిలో సీటును బుక్ చేసుకునేందుకు కర్చీఫ్ వేస్తారేమోనంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేసింది.
Read Also: Vijay Deverakonda: పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లి.. దేవరకొండ స్వీట్ సర్ప్రైజ్
కాగా, ఐదో విడత పోలింగ్‌లో భాగంగా అమేథి స్థానానికి మే 20న ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ వరుసగా రెండో సారి బీజేపీ తరపున పోటీలో ఉన్నారు. 2019 కంటే ముందు వరుసగా మూడు సార్లు రాహుల్ విజయం గెలిచారు. గతంలో గాంధీ కుటుంబ సభ్యులు సోనియా, రాజీవ్, సంజయ్ కూడా ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు మంచి పట్టున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు హస్తం పార్టీ పూర్తిగా ఆదరణ కోల్పోయింది. గత ఎన్నికల్లో అమేథిలో రాహుల్ ఓటమి తర్వాత ఆ పార్టీ క్రమంగా వెనకబడిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి పోటీ చేస్తారా? లేదా? అన్నది సందిగ్ధం నెలకొంది.
Read Also: PM Modi: రిజర్వేషన్లు రద్దు, మతం ఆధారంగా విభజించడం జరగదు..
ఇక, ఇదే సమయంలో ఇటీవల రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమేథి ప్రజలు తన ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ తన అభ్యర్థిత్వంపై సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీపై స్పందిస్తూ.. పార్టీ చెప్పినట్లే నడుచుకుంటానన్నారు. ఆయన ప్రస్తుతం పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్ స్థానానికి ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక అమేథిలో నామినేషన్ వేసేందుకు మే 3వ తేదీ చివరిది.. దీంతో వయనాడ్ పోలింగ్ తర్వాత అమేథిలో రాహుల్ గాంధీ పోటీపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.