Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలకంగా మారిన శ్రవణ్ రావును పోలీసులు నేడు మరోసారి విచారణకు పిలిపించారు. ఇప్పటికే మూడు సార్లు శ్రవణ్ రావును విచారించిన దర్యాప్తు బృందం, తాజా పరిణామాల నేపథ్యంలో నేడు కూడా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. శ్రవణ్ రావు సెల్ ఫోన్ లో తొలగించిన సమాచారాన్ని పోలీసులు రీట్రీవ్ చేస్తున్నట్లు సమాచారం. ఫోన్లో ఉండే డిలీట్ చేసిన డేటా ద్వారా మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో శ్రవణ్ రావు పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్న కారణంగా, ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన ‘నాట్ టు అరెస్ట్’ రిలీఫ్ ను కొట్టివేయాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్నట్టు సమాచారం.
ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు పాత్రపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది. ప్రణీత్ రావ్ కి శ్రవణ్ రావు ఎవరెవరి ఫోన్ నెంబర్లను ఇచ్చి ట్యాపింగ్ చేయించాడన్న విషయంపై పోలీసులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రవణ్ రావు నోరు విప్పితే ఈ కేసులో మలుపులు తిరగనున్నట్టు తెలుస్తోంది. కీలక వ్యక్తుల పేర్లు బయట పడే అవకాశముండటంతో, అధికార వర్గాలు ఈ దిశగా వేగంగా దర్యాప్తు జరుపుతున్నాయి.