September 17: సెప్టెంబర్ 17 అంటే ఒక ఉద్యమం.. ఒక ఉద్వేగం.. చరిత్రలో నిలిచిపోయిన సందర్భం.. పాత తరాల పోరాటానికి, భావి తరాలు స్ఫూర్తి పొందడానికి వాస్తవంగా నిలిచిన నిజమైన ఉదాహరణ. తెలంగాణ చరిత్రలో మర్చిపోలేని రోజు.. సెప్టెంబర్ 17. ఆ రోజు తెలంగాణ సమాజం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యానికి మళ్లిన రోజు. నిరంకుశ నిజాం ప్రభువుకు, ప్రజలకు మధ్య జరిగిన పోరు. కానీ దాన్ని హిందూ ముస్లిం మతాల మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వివాదం రేపుతోంది.
తెలంగాణలో కూడా అదే జరిగింది..
రాచరికం హద్దుమీరినప్పుడు.. నిరంకుశత్వం పతాకస్థాయికి చేరినప్పుడు.. కచ్చితంగా విప్లవం వస్తుంది. తెలంగాణలో కూడా అదే జరిగింది. ఏళ్ల తరబడి నిజాం నిరంకుశ పాలనలో విసిగిపోయిన ప్రజలు.. పోరాటాలకు సిద్ధమయ్యారు. ప్రతి గ్రామంలో కుల, మతాలకు అతీతంగా జనం ఏకమై యుద్ధానికి నడుం బిగించారు. చావో రేవో తేల్చుకోవడానికి తెగించి రంగంలోకి దూకారు. నిజాం ముస్లిం.. మెజార్టీ ప్రజలు హిందువులు. చరిత్రలో ఇది నిజం. కానీ పోరాటం మత కోణంలో జరగలేదు. నిజాం నిరంకుశత్వమే కాదు.. నిజాంను అడ్డుపెట్టుకుని హిందూ దొరలు చేసే అరాచకాలు కూడా తక్కువేం కాదు. ఈ మొత్తం అరాచకాలకు వ్యతిరేకంగా సాగింది రైతాంగ పోరాటం. ఈ పోరాటానికి విద్యావంతులు, మేధావులు సహకరించడంతో పాటు నాయకత్వం వహించారు. ముస్లిం అయినా షోయబుల్లాఖాన్ .. ఓ జర్నలిస్టుగా నిజాం నిరకుంశత్వంపై పెన్ను ఎక్కుపెట్టి బలైపోయారు. ఇలా ఎంతో మంది బలిదానాల తర్వాత.. నిజాం సైన్యం బాగా బలహీనపడిన సమయంలో నిజాం సంస్థానంలోకి యూనియన్ సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో ప్రవేశించింది. అప్పటికే రైతాంగ పోరాటంతో బలహీనపడ్డ నిజాం యూనియన్ సైన్యంతో పెద్దగా ప్రతిఘటించకుండానే చేతులెత్తేసింది. దీంతో నిజాం రాజు అప్పటి యూనియన్ హోం మంత్రి సర్దార్ పటేల్‌కు లొంగిపోయారు.
ముఖాముఖి పోరుకు దిగాల్సిన పనిలేకుండానే..
యూనియన్ సైన్యం ఎక్కడా నిజాం సేనతో నేరుగా యుద్ధం చేయలేదు. ముఖాముఖి పోరుకు దిగాల్సిన పనిలేకుండానే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది. కానీ పోలీస్ చర్య కంటే ముందే రజాకార్ల దౌర్జన్యాలకు, నిజాం సైన్యం ఆగడాలకు సామాన్యులు బలైపోయారు. ఇక్కడ హిందువులు, ముస్లింలు అనే తేడా ఎవరూ చూడలేదు. అవకాశం ఉన్నవాడు దోచుకున్నాడు. శక్తి లేనివాడు బలైపోయాడు. జరిగింది ఇదైతే.. సాయుధ పోరాటాన్ని మతం కోణంతో చూడటం గందరగోళానికి దారితీసింది. తెలంగాణలో ఇప్పటికీ నాటి ఘటనలకు సాక్షులు చాలా మంది ఉన్నారు. అసలు జరిగిందేంటి.. ఇప్పుడు చేస్తున్న ప్రచారమేంటి అని వాళ్లు మథనపడుతున్నారు. పోరాటాన్ని గౌరవించకపోగా.. తప్పుడు భాష్యాలు చెప్పి.. ప్రాణాలు అర్పించిన వాళ్లను అవమానిస్తున్నారనే వాదన కూడా వారి నుంచి బలంగా వినిపిస్తోంది.
పోరాటానికి మతం ముసుగు..
అసలు భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటంలో.. కులం, మతం, ప్రాంతం, వర్గాలకు తావు ఉండే ప్రశ్నే లేదు. నిజాం గద్దె దిగాలనే ఏకైక సంకల్పంతో.. అత్యంత సాహసంతో జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి మతం ముసుగు అద్దడం, ఎవరికి తోచిన భాష్యం వాళ్ల చెప్పడం వివాదానికి దారితీస్తోంది. సెప్టెంబర్ 17 చరిత్రను ఎవరికి తోచిన విధంగా వాళ్లు అన్వయించుకుంటున్నారే కానీ.. ఆ ఉద్యమ ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి.. మిగిలిపోయిన లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారో ఎవరూ చెప్పడం లేదు. ఎవరికి వారు పొలిటికల రేస్ లో పరిగెడుతున్నారు. దారిలో ఏం దొరికితే దాన్ని తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 17 కూడా అలాంటిదే. వారి దృష్టిలో దానికి అంతకు మించిన ప్రత్యేకత ఏమీ లేదు. కానీ ప్రజలకు మాత్రం సెప్టెంబర్ 17తో భావోద్వేగ బంధం ఉంది. అసలు బంధాన్ని తుంచేసి.. కొసరు సంబంధాలు అంటగట్టే పనిలో బిజీగా ఉన్నాయి పార్టీలన్నీ.
పోరులో అసలు ఛాంపియన్లు ప్రజలు..
చరిత్రలో మంచి, చెడు రెండూ ఉన్నా.. మంచి నుంచి స్ఫూర్తి పొందాలి. చెడును చూసి మరోసారి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అంతేకానీ ఓటు బ్యాంకు పాలిటిక్స్‌కు ఏది పనికొస్తే దాన్ని ప్రజలపై రుద్దే సంస్కృతికి తెరతీయకూడదు. ఏ పని చేసినా.. అందులో రాజకీయం వెతుక్కోవడం అలవాటైన నేతలు.. ఇప్పుడు సెప్టెంబర్ 17ను కూడా అలాగే చేస్తున్నాయి. పార్టీకో పేరుతో కార్యక్రమాలు చేస్తూ.. ప్రజలకు అసలు చరిత్ర ఏంటో తెలియకుండా చాలా జాగ్రత్తపడుతున్నాయి. భావి తరాలకు నిజాలు తెలియకుండా మసపూసి మారేడుకాయ చేస్తున్నాయి. పార్టీకో నినాదంతో ఊదరగొడుతూ.. ప్రజల్ని పిచ్చి భ్రాంతిలో ముంచేసే ప్రయత్నం చేస్తున్నాయి. సెప్టెంబర్ 17కు ఏ పార్టీ కూడా ఛాంపియన్ కాదు. అసలు ఛాంపియన్లు ప్రజలు. ఈ నిజం ఒప్పుకోవడానికి పార్టీలకు హిపోక్రసీ అడ్డం వస్తోంది. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి రకరకాల ముసుగులు వేసుకుని.. నానా పాట్లు పడుతున్నాయి. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురు నాయకుల్లో.. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి తోపాటు.. మఖ్తూం మొహినోద్దీన్ ఉన్న వాస్తవాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. ఏ రకమైన చారిత్రక పరిశోధనని చూసినా కూడా సెప్టెంబర్ 17, 1948 నాడు హైదరాబాద్ రాజ్యం భారత సమాఖ్యలో భాగం అయ్యిందని ఉంటుంది. దానికి కొనసాగింపుగా జనవరి 26, 1950 నాడు అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా హైదరాబాద్ ప్రజాస్వామ్య గణతంత్రమైన భారత దేశంలో భాగం అయ్యింది.
భారత స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దశాబ్దాలపాటు సమాంతరంగా సాగాయి. జాతీయోద్యమంలో చోటుచేసుకున్న ‘జలియన్వాలా బాగ్’ దురంతం వంటివాటికి ఉన్న గుర్తింపు నిజాం రాజ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనలకు లభించలేదు. గుండ్రాంపల్లి, బైరాన్పల్లి వంటి వందలాది గ్రామాలను నిరంకుశ నిజాం జలియన్వాలా బాగ్లుగా మార్చివేశాడు. చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిపోయింది. ఈ క్రమంలో లక్షలాది ప్రజలు అసువులు బాశారు. చరిత్రాత్మకమైన సాయుధ పోరాటానికీ, భారత్లో హైదరాబాద్ కలిసిన సెప్టెంబర్ 17కూ స్వార్థపూరిత రాజకీయాల వల్ల తగిన గుర్తింపు రాకపోవడం బాధాకరం. దశాబ్దాల తరబడి జరిగిన తెలంగాణ ఉద్యమం విభిన్న మతాల, విభిన్న వర్గాల, విభిన్న కులాల సమాహారంగా జరిగిన ఒక లౌకిక, ప్రజాస్వామ్య, ప్రజా బాహుళ్య ఉద్యమానికి ప్రతీక. ఇది నిజం..
READ ALSO: Meghalaya Political Crisis: మేఘాలయలో ఒకేరోజు 8 మంది మంత్రులు రాజీనామా.. ఈశాన్య రాష్ట్రంలో గందరగోళం