CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బహిరంగ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూటమిపై పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు జగన్. పెన్షన్ల విషయంలో రాజకీయం చేస్తున్నారని విపక్షాలపై మండిపడుతున్నారు. కూటమిపై, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. 2014 మేనిఫెస్టోలో ఇదే కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలకు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోను చూపిస్తూ.. అందులో ఎన్ని హామీలు అమలు కాలేదో.. ఎందుకు కాలేదో వివరిస్తున్నారు. తాజాగా టీడీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందని సీఎం జగన్ అన్నారు. అటువైపున కౌరవ సైన్యం ఉందన్నారు. అందరిని మోసం చేసిన చరిత్ర కూటమిది అంటూ టీడీపీ, జనసేన, బీజేపీపై మండిపడ్డారు. సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన జగన్… ఇప్పుడు మలి విడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. రేపు(మే 4) హిందూపురం, పలమనేరు, నెల్లూరులో ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు.
Read Also: Dadisetti Raja: భర్తకు మద్దతుగా భార్య.. తండ్రికి తోడుగా తనయుడు ఎన్నికల ప్రచారం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారానికి సంబంధించిన ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రాఘురామ్ విడుదల చేశారు. సీఎం జగన్ రేపు మూడు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురం పార్లమెంట్ పరిధిలోని హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.