Abdullapurmet Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణ కస్టడీ కొనసాగుతోంది. కస్టడీలో భాగంగా హరిహరకృష్ణను రెండో రోజు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు విచారిస్తున్నారు. కోర్టు అనుమతితో నిన్న సరూర్‌నగర్‌లోని ఎస్ఓటీ కార్యాలయంలో విచారించిన పోలీసులు ఇవాళ కూడా విచారిస్తున్నారు. ఈనెల 9 వరకు నిందితుడిని కస్టడీకి కోర్టు అనుమతించగా.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం హరిహరకృష్ణను ఈరోజు తెల్లవారుజామున ఘటనాస్థలికి పోలీసులు తీసుకెళ్లారు. హత్య చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు.
నవీన్‌ని హత్య చేయడానికి కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా లేకపోతే ఇంకేమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన అనంతరం హరిహరకృష్ణ లొంగిపోయినా.. శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు దొరక్కుండా నిందితుడు జాగ్రత్తలు తీసుకోవడం వెనక.. ఎవరైనా సహాయం చేశారా.. సలహాలిచ్చారా.. అనే వివరాలు రాబట్టాల్సి ఉంది. ఈ కేసులో నిందితుడి స్నేహితురాలుపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు మూడుసార్లు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి విచారించగా.. స్పష్టమైన సమాధానాలు రాబట్టలేకపోయారని తెలుస్తోంది.
Read Also: School Student: స్కూల్‌లో మూడో తరగతి విద్యార్థి మృతి.. టీచర్ కొట్టడం వల్లే!
నవీన్ మర్డర్ కేసు సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో పాయింట్ టూ పాయింట్ మళ్లీ వెతికారు. ముందుగా మూసారంబాగ్‌లోని సోదరి ఇంటికి హరిహరకృష్ణను పోలీసులు తీసుకువెళ్లారు. అక్కడే హరిహరతో పాటు అతని సోదరిని పోలీసులు విచారించారు. మూసారంబాగ్ నుండి అంబర్ పేట్‌లోని తిరుమల వైన్స్ వరకు హరిహరను తీసుకు వెళ్ళారు. తిరుమల వైన్స్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ హత్య చేసిన స్పాట్‌కు పోలీసులు నిందితుడిని తీసుకెళ్లారు. ఘటనాస్థలిలో హత్య జరిగిన తీరును పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి బ్రాహ్మణ పల్లిలోని అతని స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లారు. హత్య అనంతరం హసన్ ఇంటికి వెళ్లి రక్తపు మరకలతో ఉన్న బట్టలను హరిహరకృష్ణ మార్చుకున్నాడు. దీంతో హసన్ ఇంట్లో సాక్షాలు ఏవైనా దొరుకుతాయేమో అని పోలీసులు విచారించారు. బ్రాహ్మణ పల్లి హసన్ ఇంట్లో రీకన్‌స్ట్రక్షన్ అనంతరం తిరిగి హరిహరను ఎల్బీ నగర్ ఎస్వోటి కార్యాలయానికి తీసుకువచ్చారు. మరోవైపు పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి.. నిందితుడి పోలీసు కస్టడీ ముగిసిన అనంతరం సరైనా ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నవీన్ హత్యకేసు విచారణ ముగిసేలా చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.