భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ 2047 నాటికి అంటే 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 లక్ష్యాలు చేరుకోవాలంటే వచ్చే ఐదేళ్లూ చాలా కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని అభివృద్ధి చెందిన దేశంగా మారడం అనేది కలగా మిగిలిపోరాదని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో చెప్పారు. ఇదిలా వుండగా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్ చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తోంది. 2047 నాటికి దేశ తలసరి ఆదాయం గణనీయంగా పెరగనున్నట్లు ఆ రిపోర్ట్ లో పేర్కొంది.
ప్రస్తుతం 2022- 23 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 2 లక్షలుగా ఉంది. ఇక అది 2047 నాటికి రూ. 14.9 లక్షలకు పెరగనున్నట్లు ఎస్బీఐ తన రిపోర్టులో పేర్కొంది. అంటే దాదాపు ఏడున్నర రెట్లు తలసరి ఆదాయం పెరిగినట్లు లెక్క. అంటే ఇంకా కేవలం 23యేళ్లలోనే భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి అభివృద్ధి చెందిన దేశంగా అమెరికా వంటి దేశాల సరసన చేరనుంది.
Also Read:RBI: ఆర్‌బీఐ కొత్త ప్లాట్‌ఫామ్.. ఇక లోన్ పొందడం చాలా ఈజీ
కేవలం ఈ గణాంకాలు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చి నివేదిక వెల్లడించింది.2047 నాటికి ట్యాక్స్ చెల్లింపుదారుల సగటు ఆదాయం రూ. 49.9 లక్షలకు పెరగనుందని తెలిపింది. ప్రస్తుతం 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో వీరి ఆదాయం రూ.13 లక్షలుగా ఉంది. ట్యాక్స్ చెల్లించే వారి సంఖ్య 48. 2 కోట్లకు పెరగనుందని స్టేట్ బ్యాంక్ రీసెర్ఛ్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం దేశంలో ట్యాక్స్ చెల్లింపులు చేస్తున్న వారి సంఖ్య 8. 5 కోట్లగా ఉంది.
జీరో ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 25 శాతం మేర తగ్గనుందని అంచనా వేసింది. దీనిని బట్టి చూస్తే దేశంలో ఆదాయం పెరిగి ఎక్కువ మంది ట్యాక్స్ చెల్లించే పరిధిలోకి వస్తే అంటే ప్రజల జీవన ప్రమాణాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అంటే మోడీ చెప్పినట్లుగానే వందో స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడం, భారతీయుల చిరకాల వాంఛ నేరవేరడం పక్కాగా కనిపిస్తోంది.